Begin typing your search above and press return to search.

డీజే సౌండ్‌ కు ఉక్కిరిబిక్కిరైన మిడ‌త‌ల దండు

By:  Tupaki Desk   |   28 May 2020 11:30 PM GMT
డీజే సౌండ్‌ కు ఉక్కిరిబిక్కిరైన మిడ‌త‌ల దండు
X
పాకిస్థాన్ నుంచి దేశంలోకి ప్ర‌వేశించి ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడ‌త‌ల దండు విజృంభిస్తున్నాయి. రోజులుగా రాకాసి మిడతలు దేశాన్ని కలవరపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో పంటల‌కు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆ దండు తెలంగాణ వైపు దూసుకురావొచ్చనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తెలుగు రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. అదంతా ప‌క్క‌న పెడితే ఈ మిడతల దండును త‌ర‌మికొట్ట‌డానికి డీజే సౌండ్‌లు అద్భుతంగా ప‌ని చేస్తున్నాయి. దీనిపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించారు. ఆ డీజే చ‌ప్పుళ్ల‌కు మిడ‌త‌లు త‌ట్టుకోలేక పంట‌ల‌పై వాల‌కుండానే వెళ్లిపోయాయి. దీనిపై ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది.

వాస్త‌వంగా మిడ‌త‌లు త‌క్కువ సంఖ్య పంట పొలాల వ‌ద్ద ఉంటాయి. కానీ ఇప్పుడు వ‌చ్చిన మిడ‌త‌లు భారీసంఖ్య‌లో వ‌స్తున్నాయి. ఆ వ‌చ్చిన మిడ‌త‌లు త‌మ శరీర బరువుకు మించి ఆహారాన్ని తింటాయి. ఈ క్ర‌మంలో పంటలపై వాలి అందినంత కాడికి తినేసి పంట‌ల‌ను నాశనం చేసి వెళ్తాయి. సుమారు 35 వేల మందికి సరిపడే ఆహారాన్ని ఇవి ఒక్కరోజులోనే తినేసి వెళ్తున్నాయ‌ని అధికారులు చెబుతున్నారు.

వాటిని తరిమికొట్టే ప‌రిష్కారం లేక‌పోవ‌డంతో స్థానిక రైతులు అద్భుతంగా ఆలోచించారు. ఇన్నాళ్లు శ్రమించి పండించిన పంట మిడ‌త‌ల పాలు కాకుండా నివార‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే పెళ్లిళ్లు, శుభ‌కార్యాల్లో ఉపయోగించే డీజే బాక్స్‌ల‌ను (భారీ స్పీకర్లు కలిగిన వాహనం) పొలాల వ‌ద్ద ఏర్పాటుచేసి మిడతల దండును తరిముతున్నారు. డీజే స్పీకర్ల నుంచి వెలువడే భారీ శబ్ధాలకు ఆ మిడతలు త‌ట్టుకోలేక ప‌రార‌య్యాయి. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పోలీస్ అధికారి రాహుల్ శ్రీవాస్తవ ట్వీట్ చేశాడు.

ఈ మిడతలను తరిమేందుకు డీజే స్పీకర్లే కాకుండా చప్పట్లు, పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేయొచ్చని ఈ సంద‌ర్భంగా రైతుల‌కు సూచిస్తున్నారు. ఒక‌వేళ వ‌స్తే తెలంగాణ రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండండి. డీజే బాక్స్‌లు ఏర్పాటుచేసి పొలాల నుంచి వాటిని త‌రిమికొట్టండి. ఈ లోక‌ల్ ఆలోచ‌న‌తో మిడ‌త‌లు ప‌రారై పంటలను మ‌నం రక్షించుకోవచ్చు అని ఆ అధికారి చెబుతున్నారు.