Begin typing your search above and press return to search.

దీపావళి థమాకా.. షాకిచ్చేలా పెరిగిన కమర్షియల్ గ్యాస్.. రోజులో అంతనా?

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:30 AM GMT
దీపావళి థమాకా.. షాకిచ్చేలా పెరిగిన కమర్షియల్ గ్యాస్.. రోజులో అంతనా?
X
దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి నిర్ణయం వెలువడింది. రోడ్డు పక్కన బండి మీద అమ్మే ఇడ్లీ బండి మొదలు స్టార్ హోటల్ కిచన్ వరకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా వణికేలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రికార్డు స్థాయిలో ఒక్కరోజులో పెంచేసిన వైనం చోటు చేసుకుంది. ఒకే ఒక్క రోజులో రూ.268 పెంచేయటం ద్వారా.. భారీ బాదుడుకు తెర తీసింది. తాజా పెంపుతో ఏడాది వ్యవధిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద పెరిగిన ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.785. గడిచిన కొంతకాలంగా రోజువారీగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచుతున్నట్లే.. గ్యాస్ బండ రేట్లను పెంచుతున్నారు. తాజా పెంపు మాత్రం భారీగా ఉందన్న మాట అందరి నోట వినిపిస్తోంది.

తాజా పెంపుతో.. ఆహారపదార్థాల రేట్లు భారీగా పెరగటం ఖాయమని చెబుతున్నారు. ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధరను పెంచని కేంద్రం.. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ బండ ధరల్ని భారీగా పెంచేసింది. తాజా పెంపుతో రోడ్డు పక్కనే ఉండే టీ దుకాణంలో టీ ధర సైతం మారనుంది. ఇడ్లీ బండి.. బజ్జీల దుకాణం.. ఇలా గ్యాస్ సిలిండర్ వినియోగించే ప్రతి ఒక్క షాపు దీని ప్రభావం బారిన పడనుంది. ఒక్కసారిగా సిలిండర్ మీద ఇంత భారం మోపితే.. తట్టుకునే స్థితిలో వ్యాపారులు లేరు. దీంతో.. వారు తమ మీద పడిన భారాన్ని ప్రజల మీదకు బదిలీ చేయటం ఖాయం. దీంతో ఆహార పదార్థాల ధరలకు రెక్కలు రావటం ఖాయమంటున్నారు.

వాణిజ్య సిలిండర్ ధర రూ.2వేలు టచ్ చేయటం ఇదే తొలిసారి కాదని.. 2014లో ఒకసారి జరిగిందని చెబుతున్నారు. అయితే.. రూ.2 వేల మార్కును దాటటం మాత్రం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అంతేకాదు..ఒక నెలలో ఇంత భారీగా సిలిండర్ ధర పెరిగిన చరిత్ర లేదంటున్నారు. 2020 నవంబరులో వాణిజ్య సిలిండర్ ధర రూ.1390 ఉంటే.. 2020 డిసెంబరు 1481కు చేరింది. అది కాస్తా 2021 జనవరికి రూ.1502కు చేరింది.అది మొదలు.. ప్రతి నెల పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ లో 1814కు చేరిన గ్యాస్ బండ ధర మే లో కాస్త తగ్గింది. జూన్.. జులైలో 1730గానే ఉంది. ఆ తర్వాత రెక్కల గుర్రం మాదిరి పెరుగుతూనే ఉంది. తాజాగా రూ.2175కు చేరిన కమర్షియల్ బండ.. వ్యాపారుల పాలిట భారీ ‘బండ’గా మారిందని చెప్పక తప్పదు. కరోనా కారణంగా వీధి వ్యాపారాలు తగ్గిన వేళ.. గ్యాస్ బండ ధర ఇంతలా పెరగటం వ్యాపారుల పాలిట దుర్వార్తగా మారుతుందని చెప్పక తప్పదు.