Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో బెంగాల్ విభ‌జ‌న‌.. మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం?

By:  Tupaki Desk   |   8 Nov 2022 4:03 AM GMT
త్వ‌ర‌లో బెంగాల్ విభ‌జ‌న‌.. మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యం?
X
గ‌త జ‌మ్ము క‌శ్మీర్ విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ.. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేశారు. అదేస‌మ‌యంలో జ‌మ్ము క‌శ్మీర్‌ను విడ‌దీసి.. ఒక‌టి అసెంబ్లీ ఉన్న కేంద్ర‌పాలిత ప్రాంతంగాను, మ‌రొక‌టి రాష్ట్రంగాను విభ‌జించిన విష‌యం తెలిసిందే. దీనిపై అనేక విమ‌ర్శ‌లు.. వివాదాలు..వ‌చ్చినా.. ఆయ‌న ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, ఇప్పుడు మోడీ స‌ర్కారు దృష్టి ప‌శ్చిమ బెంగాల్‌పై ప‌డింద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ రాష్ట్ర విభజనకు మోడీ స‌ర్కారు శ్రీకారం చుడుతున్న‌ట్టు జాతీయ మీడియా గుప్పుమంటోంది.

బంగాల్ రెండుగా విభ‌జించి, ఉత్తర బంగాల్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చనున్నార‌నే చ‌ర్చ జోరుగా వినిపిస్తోంది. దీంతో మోడీ ఏం చేస్తున్నార‌నేది ఆస‌క్తిగాను.. అదేస‌మ‌యంలో రాజకీయంగాను ప్రాధాన్యం సంత‌రించుకోవ‌డం గ‌మ‌నార్హం. బంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ నేతలతో గ్రేటర్ కూచ్బెహర్ పీపుల్స్ అసోసియేషన్ నేత అనంత్ రాయ్ భేటీ కావడం ఈ వాదనలకు ఆజ్యం పోసింది. ఉత్తర బంగాల్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటం దాదాపుగా ఖాయమైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్, బీజేపీ నేత సునీల్ బన్సల్, బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్తో.. గ్రేటర్ కూచ్బెహర్ పీపుల్స్ అసోసియేషన్ నేత అనంత్ రాయ్(మహారాజ్) భేటీ అయ్యారు. సిలిగుడిలో జరిగిన ఈ 90 నిమిషాల భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర బంగాల్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న తన డిమాండ్లో మార్పు లేదని అనంత మహారాజ్.. స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బంగాల్లో దుమారం రేపాయి. రాష్ట్ర విభజన తథ్యం అనే రీతిలో ప్రచారం సాగుతోంది. దీనిపై విపక్షాలు మండిపడుతుండగా.. బీజేపీ క్యాంపులోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, నిశిత్ ప్రామాణిక్ మాత్రం.. విభజనపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 'సునీల్ బన్సల్ తొలిసారి ఉత్తర బంగాల్కు వచ్చారు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే. అనంత్ మహారాజ్ సైతం మర్యాదపూర్వకంగానే కలిశారు' అని ప్రామాణిక్ చెప్పుకొచ్చారు. బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ సైతం విభజన వార్తలను కొట్టిపారేశారు. 'శ్యామాప్రసాద్ ముఖర్జీ కోరుకున్న బంగాల్ రాష్ట్రం మాకు కావాలి. రాష్ట్ర విభజన గురించి కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే విషయంపై గానీ కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు' అని స్పష్టం చేశారు.

త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి రావడం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అటు, వామపక్షాలు ఈ అంశంపై మండిపడుతున్నాయి. 'ఇవి నీచ రాజకీయాలు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఇలాంటి ఊహాగానాలు ఎందుకు లేవనెత్తుతున్నారు?' అని సీపీఎం నేత అశోక్ భట్టాచార్య ప్రశ్నించారు. సిలిగుడి మేయర్ గౌతమ్ దేబ్.. బీజేపీ వర్గాల వాదనను ఖండిస్తున్నారు. 'బంగాల్ను ఎవరైనా విభజించేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలను చూస్తారు' అని హెచ్చరించారు. ఇక‌, దీనిపై అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.