Begin typing your search above and press return to search.

పొత్తులో హస్తానికి దక్కేవెన్ని...!?

By:  Tupaki Desk   |   2 Oct 2018 6:56 AM GMT
పొత్తులో హస్తానికి దక్కేవెన్ని...!?
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును గద్దె దింపేందుకు ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా అవతరిస్తున్నాయి. ఈ కూటమికి జాతీయ పార్టీ కాంగ్రెస్ సారధ్యం వహిస్తోంది. కూటమిలో తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - సీపీఐ తో పాటు చిన్న చితకా పార్టీలు కూడా ఉన్నాయి. అందరి లక్ష్యం ఒకటే అయినా సీట్ల పంపకంలో మాత్రం తేడాలోస్తున్నాయి. అందరినీ ఏకతాటి పైకి తీసుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో తేలాల్సి ఉంది. మహాకూటమిలో రెండో పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం 19 స్థానాలు ఆశిస్తోంది. వారికి 16 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్య తేడా మూడు స్థానాలే - ఈ మూడు స్థానాల కోసం అటు చంద్రబాబు గాని - ఇటు రాహుల్ గాంధీ కాని పట్టుపట్టకపోవచ్చు. మిగిలిన వంద స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అన్నదే సర్వత్ర చర్చనీయాంశమయ్యింది. మహాకూటమిలో భాగస్వామ్యా పక్షాలైన తెలంగాణ జన సమితి 30 స్థానాలు అడుగుతోంది. సీీపీఐ కూడా 10 నుంచి 15 స్థానాలు కోరుకుంటోంది. ఇంటి పార్టీ కూడా తమకు రెండంకెలలో స్థానాలు కేటాయించాలని పట్టుబడుతోంది. వారు అడిగినన్నీ స్థానాలు ఇవ్వకపోతే కూటమి నుంచి బయటకి వస్తామని లోపాయికారి హెచ్చరికలు కూడా చేస్తున్నట్లు సమాచారం.

మహాకూటమిలో చిన్న చితక పార్టీలు - కోదండరామ్ నేత్రుత్వంలోని తెలంగాణ జన సమితి ఇన్నీ స్థానాలకు పట్టు బడితే కూటమికి సారధ్యం వహిస్తున్న్ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు వంద సంవత్సారాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవడం సమంజసమా అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ గొంతేమ్మ కోరికలకు మహాకూటమి లక్ష్యం దెబ్బ తింటుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత సమ్యమనం పాటించినా ఇలాంటి ఇబ్బందులు తీసుకు రావడంతో లక్ష్యానికి తూట్లు పడతాయంటున్నారు. మహాకూటమిలో అనైక్యత కారణంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడుతుందని సీనియర్ నాయకులు కొందరు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా ఎన్నికలను ఎదురుకోవాలని హితవు పలుకుతున్నారు.