Begin typing your search above and press return to search.

అమరావతి ఆయనది... కొత్త జిల్లాలు ఈయనవి...?

By:  Tupaki Desk   |   4 April 2022 2:30 PM GMT
అమరావతి ఆయనది... కొత్త జిల్లాలు ఈయనవి...?
X
అదేంటో రాజకీయం. అంతా రాజకీయం. సర్వం రాజకీయ మయం. ఆఖరుకు అభివృద్ధి విషయంలో చూసుకున్నా క్రెడిట్ పాలిటిక్స్ ఎంటర్ అయిపోతున్నాయి. దాంతో ప్రజలు మధ్యన పడి నలిగిపోతున్నారు. ప్రజాస్వామ్య స్పూర్తి. అఖిల పక్షాలు, పిలుపులూ అసలు ఉండడం లేదు. ఇదంతా ఎందుకంటే తాజాగా కొత్త జిల్లాలను ఏపీ సర్కార్ ప్రారంభించింది. అంతా బాగానే ఉంది.

కానీ ఇది పూర్తిగా వైసీపీ సొంత కార్యక్రమంగా చేసుకుంటూ పోయారు అని పెద్ద విమర్శను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఇతర ప్రతిపక్షాలను అసలు కలుపుకుని పోలేదని అంటున్నారు. దీని మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అయితే ఘాటుగానే విమర్శలు చేశారు. కొత్త జిల్లాలు అన్నవి ప్రజల కోసం చేస్తున్న అధికారిక కార్యక్రమం. ఇందులో అన్ని రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.

ఇది పూర్తిగా మీ సొంతదని అనుకుంటే ఎలా. వైసీపీ సర్కార్ పెద్దలు అఖిల పక్షాన్ని ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. ఇక ఇదే రకమైన విమర్శలను ఇతర రాజకీయ పార్టీలు కూడా చేశాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిగా రాజకీయ కోణంతో ఉంది. మేము అధికారంలోకి వచ్చాక మొత్తానికి మొత్తం అంతా సరిచేసి చూపిస్తామని చెప్పేశారు.

మరో పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే మాట్లాడారు. కొత్త జిల్లాలలో లోపాలను తమ పార్టీ అధికారంలోకి వస్తే సవరించి తీరుతుంది అని అంటున్నారు. అంటే కొత్త జిల్లాల విషయంలో ఇల్లు అలకగానే పండుగ అయిపోలేదు అని అంటున్నారు అన్న మాట.

ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే నాడు అంతా టీడీపీ సొంత కార్యక్రమం గా చేసుకుని పోయారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ని మొక్కుబడిగా ఆహ్వానించారు. దాంతో నాడే ఆయనకు అమరావతి మీద నెగిటివిటీని టీడీపీ అలా పెంచేసిందని అంటారు.

జగన్ సీఎం కాగానే అమరావతి బదులుగా మూడు రాజధానులు అని అనడం వెనక కూడా నాడు ఆయన్ని దూరం పెట్టి టీడీపీ సొంతంగా తన రాజధానిగా భావించడమే అన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి నాడు టీడీపీ తప్పు చేసింది అనుకుంటే ఇపుడు జగన్ కూడా అదే చేశారు అని అంటున్నారు.

జగన్ కూడా కొత్త జిల్లాల విషయంలో విపక్షాలను అసలు పిలవలేదు. పూర్తిగా వైసీపీ వారే తమ చేతుల్లోకి తీసుకున్నారు. అందుకే రేపు మేము వచ్చాక కొత్త జిల్లాలకు రిపేర్లు చేస్తామని టీడీపీ, జనసేన వంటి పార్టీలు అంటున్నాయి.

దీనిని బట్టి చూస్తే ఒకరు చేసినది మరొకరు రిపేర్లు చేస్తారు, వీలు అయితే లేకుండా చేస్తారు, అంతే తప్ప అసలు వారికి ఆ క్రెడిట్ దక్కనీయరు. అమరావతి విషయంలో చంద్రబాబుకు క్రెడిట్ వెళ్తుందని వైసీపీ చూసింది.

కొత్త జిల్లాల విషయంలో జగన్ కి క్రెడిట్ రానీయకుండా రేపటి రోజున టీడీపీ కూడా పవర్ లోకి వచ్చి రిపేర్లు అంటూ మొదలెడితే ఏపీ అభివృద్ధి ఎలా సాగుతుంది అన్న ప్రశ్న అయితే వస్తుంది. దానికి కారణం ప్రజలు అయితే కానే కాదు, అవి పూర్తిగా రాజకీయాల వల్లనే అనుకోవాలి. ఒకరంటే ఒకరిని పడని పాలిటిక్స్ ని నడపడం వల్లనే మధ్య‌న పడి జనం నలిగిపోతున్నారు అనుకోవాలి.