Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణ‌యంతో వ‌ణికిపోతున్న ఆ జిల్లా ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   7 Sep 2022 12:30 PM GMT
కేసీఆర్ నిర్ణ‌యంతో వ‌ణికిపోతున్న ఆ జిల్లా ఎమ్మెల్యేలు!
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటారే ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చింద‌ని టాక్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా మునుగోడులో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల‌రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మ‌వుతుంది.

కాగా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా క‌మ్యూనిస్టుల‌కు పెట్ట‌ని కోట‌. సుర‌వరం సుధాక‌ర‌రెడ్డి, మ‌ల్లు స్వ‌రాజ్యం వంటి క‌మ్యూనిస్టు యోధులు ఆ జిల్లా నుంచి వ‌చ్చారు. ప‌లుమార్లు క‌మ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం ఘ‌న‌విజ‌యాలు కూడా సాధించాయి. ఈ నేప‌థ్యంలో మునుగోడులో క‌మ్యూనిస్టు పార్టీల‌ను క‌లుపుకుపోతామ‌ని టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ధాటికి క‌మ్యూనిస్టు పార్టీలు ఉనికి కోల్పోయాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ త‌మ స‌హాయం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించ‌డం, త‌మ‌ను కలుపుకుపోతామ‌ని చెప్ప‌డం వాటి నెత్తిన పాలుపోసిన‌ట్ల‌యింది.

ఇప్పుడు కేసీఆర్ తాజా నిర్ణ‌యం ప‌క్క జిల్లా అయిన ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను భ‌య‌పెడుతోంద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని కొత్త‌గూడెం, వైరా త‌దిత‌ర స్థానాల్లో క‌మ్యూనిస్టు పార్టీల‌కు బ‌లం ఉంది. గ‌తంలో ఈ రెండు స్థానం నుంచి కూనంనేని సాంబ‌శివ‌రావు, బానోత్ చంద్రావ‌తి క‌మ్యూనిస్టు పార్టీల త‌ర‌ఫున గెలుపొందారు. ప్ర‌స్తుతం కొత్త‌గూడెం నుంచి వ‌న‌మా వెంకటేశ్వ‌ర‌రావు, వైరా నుంచి రాములు నాయ‌క్ టీఆర్ఎస్ లో ఉన్నారు.

వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీల‌తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో క‌మ్యూనిస్టు పార్టీలు తాము బ‌లంగా ఉన్న స్థానాల‌ను ఆశించే చాన్స్ ఉంది. ఈ క్ర‌మంలో తాము గతంలో గెలిచిన కొత్త‌గూడెం, వైరా వంటి స్థానాల‌ను అడిగే అవ‌కాశం ఉంది. వీటితోపాటు తాము బ‌లంగా ఉన్న మ‌రికొన్ని సీట్ల‌ను కూడా సీపీఐ, సీపీఎం అడిగే వీలుంది. దీంతో ఆ స్థానాల్లో ప్ర‌స్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళ‌న చెందుతున్నార‌ని చెబుతున్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మొత్తం ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్యూనిస్టుల‌కు ప‌ట్టు ఉంద‌ని స‌మాచారం. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించగల స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంద‌ని అంటున్నారు.

ఇటీవ‌ల కేసీఆర్ మునుగోడులో నిర్వ‌హించిన స‌భ‌కు క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు కూడా హాజ‌ర‌య్యారు. బీజేపీని ఓడించ‌డానికి టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో క‌మ్యూనిస్టు పార్టీల‌కు, టీఆర్ఎస్ కు మధ్య పొత్తు పొడిస్తే ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐ అడిగే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. దీంతో కొత్తగూడెం, వైరా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే కాకుండా ఆశావహుల్లో సైతం గుబులు మొదలైంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర‌రావు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందన్న చెప్పుకుంటున్నారు. మ‌రోవైపు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో చెబుతున్నార‌ట‌. ఇక‌ వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ పై ఆశలు పెట్టుకోగా..మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రావతి కూడ టికెట్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

అయితే వామ‌ప‌క్షాలతో టీఆర్ఎస్ పొత్తు కుదిరి తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సీట్ల‌నే అడిగితే ఎలా అని ఈ నేత‌ల్లో దిగులు ప‌ట్టుకుంద‌ని అంటున్నారు. చివరి నిమిషంలో పొత్తుల అంశం టిఆర్ఎస్‌లో ఎటువంటి అసంతృప్తి రాజేస్తుందో చూడాల్సిందేనని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.