Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే మీద అసమ్మతి బాంబు... ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 11:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యే మీద  అసమ్మతి బాంబు... ?
X
ఆయన ముమ్మారు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు. అన్నీ కలసి వస్తే మంత్రిగా కనిపించాలని తాపత్రయపడుతున్న వారు. ఆయనే విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. ఆయన మీద ఇపుడు ఒక్కసారిగా అసమ్మతి గుప్పుమంది. సొంత పార్టీ నేతలే ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆయన మా ఎమ్మెల్యే కాదు, మేము ఆయనకు అక్కరలేదు అంటూ వారు ఎమ్మెల్యే మీద బాహాటంగా ద్వజమెత్తారు.

దీంతో ఒక్కసారిగా షాక్ తినడం ఎమ్మెల్యే వంతు అయింది. అంతే కాదు జిల్లావ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎమ్మెల్యే చేసిన తప్పేంటి అంటే ఆయన అధికార దర్పంలో క్యాడర్ ని మరచిపోవడమేనని ఆరోపిస్తున్నారు. అంతే కాదు తాను పల్లకిలో కూర్చోవడానికి బోయీలుగా మోసిన క్యాడర్ ని దిగువ స్థాయి లీడర్ ని కూడా మధ్యలో అలా వదిలేసారని ఆగ్రహిస్తున్నారు.

ఎమ్మెల్యేగా మీరు గెలవడానికి మా జవం, జీవం అంతా ఖర్చు చేశాము, ఇపుడు మీరు మీకు మేము అవసరం లేదు, ఎలా సార్ ఇది అంటూ ఏకంగా ఎస్ రాయవరం ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ ద్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఆయన్ని చూడాలని కలలు కంటే మాకే ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే టీడీపీ, జనసేన నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తూ తమను కరివేపాకులా వదిలేశారని ఆయన విమర్శిస్తున్నారు.

తాజాగా ఎమ్మెల్యే బాబురావుకు వ్యతిరేకంగా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి,ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాలకు చెందిన వైసీపీ క్యాడర్ అంతా బంగారమ్మపాలెంలో హాట్ హాట్ గా మీటింగ్ పెట్టి మరీ ఆయన మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందులో ఎంపీపీతో, జెడ్పీటీసీతో పాటు, మాజీ సర్పంచులు, కీలక నేతలు కూడా పాల్గొనడం విశేషం.

వీరంతా బాబూరావు వ్యవహారశైలి మారాల్సిందే అంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పాయకరావుపెట నియోజకవర్గంలో ఇసుక, కంకరతో పాటు అక్రమ బియ్యం రవాణా సాగుతోంది అని వైసీపీ నేతలే ఆరోపించడం కూడా ఈ సందర్భంగా విశేషం. ఎమ్మెల్యే వైఖరి మీద వారు గుర్రుమనడమే కాకుండా ఆయన ముఖం చూసేది లేదని సమావేశంలో తీర్మానించడం నిజంగా వైసీపీకి షాకింగ్ లాంటి పరిణామంగానే చూడాలి.

అధికారంలో పార్టీ ఉంటే తమ మాట ఏ అధికారి వినడంలేదని, తాము చెప్పిన పనులు చేయడంలేదని వారు అనడం విశేషం. ఎమ్మెల్యే సైతం అధికారులను బెదిరిస్తున్నారని, తన సొంత వారి పనుల కోసమే ఆయన ఇలా చేస్తున్నారని వారు చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే తో తాము సమరానికి రెడీ అంటున్నారు అంతా. మరి దీని మీద ఎమ్మెల్యే బాబూరావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

చిత్రమేంటి అంటే ఆయన జెడ్పీ ఈవోగా ఉండగా నాటి కాంగ్రెస్ మంత్రి కొణతాల రామక్రిష్ణ ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి కాంగ్రెస్ టికెట్ మీద 2009 ఎన్నికల్లో పోటీ చేయించారు. అలా గెలిచిన బాబూరావు, జగన్ పార్టీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఇక 2014లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019 ఎన్నికల్లో మాత్రం మంచి మెజారిటీతో పాయకరావుపేట నుంచి విజయం సాధించారు. అన్నీ బాగుంటే ఆయన పేరు కూడా మంత్రి రేసులో ఉండేది. కానీ ఇపుడు ఈ అసమ్మతి బాంబుతో బాబూరావు ఇబ్బందులలో పడినట్లుగానే చెప్పుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం వ్యతిరేకంగా ఉండడం అంటే చిన్న విషయం మాత్రం కాదనే అంటున్నారు.