Begin typing your search above and press return to search.

టీడీపీకి స‌హ‌క‌రించారని ఒక‌రు.. మంత్రితో గొడ‌వ‌ప‌డ్డార‌ని మ‌రొక‌రు

By:  Tupaki Desk   |   26 April 2023 8:00 PM GMT
టీడీపీకి స‌హ‌క‌రించారని ఒక‌రు.. మంత్రితో గొడ‌వ‌ప‌డ్డార‌ని మ‌రొక‌రు
X
ఏపీలో తాజాగా డీఎస్పీల బ‌దిలీలు జ‌రిగాయి. ఇవేవీ సాధార‌ణంగా జ‌రిగే బ‌దిలీలు కావ‌ని.. రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. కీల‌క మార్పులే చేశారని అంటున్నాయి. మంత్రితో వివాదం పెట్టుకున్న ఒక డీఎస్పీని, టీడీపీకి స‌హ‌క‌రించారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌రో డీఎస్పీని కూడా బ‌దిలీ చేశారు. అయితే.. అదేస మ‌యంలో టీడీపీని ముప్పు తిప్ప‌లు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి డీఎస్పీని మాత్రం కొన‌సాగించారు.

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని అమ‌లాపురంలో కొన్నాళ్లుగా మంత్రి పినిపే విశ్వ‌రూప్‌కు..ఇక్క‌డ డీఎస్పీ గా ఉన్న మాధ‌వ‌రెడ్డికి మ‌ధ్య ప‌డ‌డం లేదు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఏర్ప‌డిన కోన‌సీమ వివాదంలో మంత్రి మాట‌ల‌ను ఆయ‌న పెడ‌చెవిన పెట్టార‌నే వాద‌న ఉంది.

ఇక‌, ఇటీవ‌ల అంబేద్క‌ర్ జయంతి సంద ర్భంగా.. పినిపే అన‌చ‌ర యూత్ స‌హా.. కొంద‌రు యువ‌కులు బైకుల సైలెన్స‌ర్లు తీసేసి హంగామా సృష్టించా రు. దీంతో పినిపే ఏకంగా డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా డీఎస్పీ మాధ‌వ‌రెడ్డి కూడా అదే రేంజ్‌లో స‌మాధానం చెప్పారు. అంతే. ప‌ట్టుమ‌ని 10 రోజులు తిరిగే స‌రికి.. మాధ‌వ‌రెడ్డిని మ‌చిలీప‌ట్నం బ‌దిలీ చేశారు. ఇక‌, గుడివాడ డీఎస్పీగా ఉన్న విజ‌య్ పాల్‌.. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన‌స‌మ‌యంలో స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌లు చేశారు వైసీపీ నాయ‌కులు. నిజానికి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుని తీరాల‌ని వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

కానీ, గుడివాడ అడ్డాలోకి చంద్ర‌బాబు రావ‌డం.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం.. పార్టీని ఉత్తేజ ప‌ర‌చ‌డం.. సాఫీగా సాగిపోయాయి. ఇలా.. ఇంత సాఫీగా సాగిపోవ‌డానికి డీఎస్పీనే కార‌ణ‌మ‌ని మాజీ మంత్రి కొడాలి నాని వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేసింది. ఇది జ‌రిగి కూడా ప‌ది రోజులు కాకుండానే.. విజ‌య్‌పాల్‌ను బ‌దిలీ చేసేశారు. ఇదీ.. క‌థ‌! ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. టీడీపీని ముప్పు తిప్ప‌లు పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న తాడిప‌త్రి డీఎస్పీచైత‌న్య‌ను మాత్రం క‌ద‌ల్చ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.