Begin typing your search above and press return to search.

శశికళకు కొత్త టెన్షన్.. అందుకేనా?

By:  Tupaki Desk   |   21 Dec 2016 4:37 AM GMT
శశికళకు కొత్త టెన్షన్.. అందుకేనా?
X
తమిళనాడులో నిన్నమొన్నటివరకూ వినిపించిన అమ్మపేరు స్థానే ప్రస్తుతం శశికళ నామస్మరణ జరుగుతుంది. అటు అన్నాడీఎంకే నేతలు చాలా మంది అమ్మ లేనికారణంగా చిన్నమ్మను ఆమెస్థానంలో చూసుకోవాలని కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలతో మూడోసారి కూడా పన్నీర్ సెల్వం గెస్ట్ సీఎం పాత్రకే పరిమితం కావాలేమో అని ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులను అందుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్న చిన్నమ్మ శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల భయం పట్టుకుందట. ఈ మేరకు తమిళనాడు - జాతీయ మీడియాల్లో కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే ఇక పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తుకు దెబ్బతగులుతుందనే కారణంతోనే పార్టీ బాధ్యతలు చేపట్టడంపై ఆమె వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు!

అయితే... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తొలి ముద్దాయి.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కాగా, శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు. ఇళవరసి - సుధాకరన్‌ లు మూడు - నాలుగో ముద్దాయిలుగా ఉన్నారు. అయితే చెన్నై - బెంగళూరుల్లో 18 ఏళ్ల పాటూ సాగిన ఈ కేసులో జయలలితకు రూ.100 కోట్ల జరిమానా - పదేళ్ల జైలు శిక్ష పడగా.. శశికళ - ఇళవరసి - సుధాకరన్‌ లకు తలా రూ.10 కోట్లు జరిమానా - పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు 2014లో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిరోజులు జైలు జీవితం గడిపిన అనంతరం బెయిల్‌ పై విడుదలయ్యి బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేశారు. దాంతో అక్కడ వీరంతా నిర్దోషులుగా బైటపడ్డారు. ఈ కేసు అక్కడితో ముగిసిపోయిందని అమ్మ అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఈ నలుగురిని బెంగళూరు హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది - డీఎంకేలు సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీలు చేశాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్న ఈ కేసును తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు.

అయితే అమ్మ మరణానంతరం ఈ కేసు ఇక ముగిసినట్టేనని తొలుత శశికళ వర్గం భావించినప్పటికీ న్యాయనిపుణుల క్లారిటీతో మరోసారి చిన్నమ్మకు కేసుల బెంగ పట్టుకుందట. సాదారణంగా ఈ అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ప్రభుత్వ బాధ్యుల్లో ఉన్నవారే శిక్షార్హులు. కాబట్టి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు ఈ చట్టం ప్రకారం శిక్ష వర్తిస్తుందే తప్ప శశికళకు కాదనేది అన్నాడీఎంకే పెద్దల వాదన. అయితే... శశికళపై ఈ కేసులో మరో లైన్ కూడా ఉంది. అదేమిటంటే... శశికళ ప్రోద్బలం వల్లనే జయలలిత అవినీతికి పాల్పడ్డారని! దీంతో అవినీతికి ప్రోత్సహించారని ఆరోపిస్తూ శశికళపై ఐపీసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి ఉన్నారని, ఈ చట్టం కిందనే వారికి శిక్ష విధిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిందని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇదే తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన పక్షంలో శశికళ సహా ముగ్గురు జైలు కెళ్లక తప్పదట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/