Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో ఆధారాలున్నాయి: కోర్టు

By:  Tupaki Desk   |   3 Nov 2020 3:30 AM GMT
ఓటుకు నోటు కేసులో ఆధారాలున్నాయి: కోర్టు
X
ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో కేసు నుంచి నిందితులను తొలగించలేమని (డిశ్చార్జ్) , తుదివిచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లను ఏసీబీ తోసిపుచ్చింది.
ఇటీవలే తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని.. ఈ కేసు నుంచి తన పేరు తొలగించారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ డిశ్చార్జ్ పిటీషన్లను ఏసీబీ కోర్టు దాఖలు చేశారు. వీరి వాదనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను డబ్బుతో ప్రలోభపెట్టడానికి రేవంత్ రెడ్డి, ముత్తయ్య తదితరులతో కలిసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది.

ఏసీబీ వేసిన కౌంటర్ లో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఇదే అంశంపై రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని.. ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్ లోనూ సండ్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నదని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది.

రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయసింహ కూడా ఈ కేసులో కీలకమని.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను ఉదయసింహనే తీసుకొచ్చారని ఏసీబీ వివరించింది.డబ్బును ఎక్కడి నుంచి తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి స్వయంగా ఉదయసింహకు చెప్పారని స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి ఉదయసింహను రూ.50 లక్షలను రేవంత్ రెడ్డి తెప్పించారని ఏసీబీ పేర్కొంది.

ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జు పిటీషన్లను కొట్టివేయాలని ఏసీబీ కోర్టులో వాదించింది. దీంతో కోర్టు ఏసీబీ వాదనకు అంగీకరించి నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లను తోసిపుచ్చింది.. డిశ్చార్జ్ పిటీషన్లను కోర్టు కొట్టివేసింది.