తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కు గట్టి షాక్ తగిలింది. కరీంనగర్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై 'జాగరణ దీక్ష' చేపట్టిన బండి సంజయ్ ను పోలీసులు అతి కష్టం మీద అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది.
దీంతో బండి సంజయ్ ను కోర్టు నుంచి కరీంనగర్ జైలుకు పోలీసులు తరలించారు. ఇక బండి సంజయ్ తోపాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కాచ రవి, మర్రి సతీష్ లకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు.
317 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం రాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్ నిబంధనలతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నోటీసులు జారీ చేసినా బండి సంజయ్ వినకుండా దీక్ష చేపట్టారు.
దీంతో నిన్న రాత్రి భారీగా మోహరించిన బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి బండి సంజయ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన నేతలు సమావేశం అవుతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడినే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడంపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. బండి సంజయ్ కు పూర్తి మద్దతు ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం బండి చేస్తున్న దీక్షను మెచ్చుకున్నారు. కేసుల గురించి మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు.