Begin typing your search above and press return to search.

కొత్త రూల్ కు కసరత్తు.. ఆఫీసులో కునుకు తీస్తే వేటే

By:  Tupaki Desk   |   3 Jan 2021 4:39 AM GMT
కొత్త రూల్ కు కసరత్తు.. ఆఫీసులో కునుకు తీస్తే వేటే
X
పని ఎంత ఎక్కువైనా కావొచ్చు. కానీ.. ఆఫీసులో కునుకు తీస్తే మాత్రం సదరు ఉద్యోగిపై వేటు వేసే అధికారం యజమానులకు దఖలు పరిచేలా కేంద్ర కార్మిక శాఖ ఒక నిబంధనను తాజాగా తీసుకురానుంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను సిద్ధం చేసిన కేంద్రం.. దీనిపై అభ్యంతరాల్ని.. సూచనల్ని తెలపాల్సిందిగా కోరుతూ ఒక ప్రకటన చేసింది. ఆఫీసులో నిద్ర పోవటంతో పాటు.. మొత్తం 23 అంశాల్ని ఉద్యోగి దుష్ప్రవర్తన కిందకు తీసుకొచ్చింది.

వీటి విషయంలో యజమాని ఉద్యోగి పట్ల క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లోని సెక్షన్ 29 ప్రకారం కేంద్ర కార్మిక శాఖ తయారీ.. మైనింగ్ .. సర్వీస్ రంగాల కోసం మెమోను జారీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇలా చేయటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ నమూనా ప్రకారం ఉద్యోగి ప్రవర్తన సరిగా లేకుంటే సస్పెండ్ చేసే వీలుంది. ఇన్ని నిబంధనల్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఐటీ ఉద్యోగికి పని గంటల్ని మాత్రం నిర్దేశించకపోవటం గమనార్హం. ఉద్యోగి దుష్ప్రవర్తనకు సంబంధించిన నిబంధనలు తయారీ.. సేవా రంగాలకు ఒకేలా ఉంటే.. ఐటీ పరిశ్రమ భద్రతలో భాగంగా అక్కడ పని చేసే ఉద్యోగులు అనధికారికంగా ఐటీ సిస్టం.. యజమాని.. కస్టమర్.. క్లయింట్.. కంప్యూటర్ నెట్ వర్కులోకి వస్తే చర్యలు తీసుకునే వీలు కల్పిస్తుంది.

కేంద్ర కార్మిక శాఖ తయారు చేసిన తాజా నమూనాలో పేర్కొన్న 23 అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి చూస్తే..

- ఉద్దేశపూర్వకంగా ఎదురు తిరగటం.. చెప్పిన మాట వినకపోవటం.. పై అధికారులు లిఖిత పూర్వకంగా జారీ చేసిన చట్టబద్ధమైన ఉత్తర్వుల్ని పాటించకపోవటం

- విధులకు ఆలస్యంగా రావటం.. ముందస్తుగా సెలవు తీసుకోకుండా సరైన కారణం లేకుండా తరచూ గైర్హాజరు కావటం

- విధి నిర్వహణలో మద్యం తాగటం.. గొడవ.. అల్లర్లకు పాల్పడటం.. పని చేసే స్థలంలో అమర్యాదకరంగా.. అసభ్యంగా ప్రవర్తించటం

- విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని అలవాటుగా మార్చుకోవటం

- లేని జబ్బు ఉన్నట్లు నటించటం.. పని నెమ్మదించేలా చేయటం

- దొంగతనం.. మోసం.. విధి నిర్వహణలో అవినీతి

- కింది స్థాయి ఉద్యోగుల నుంచి బహుమతులు తీసుకోవటం

- హింసకు పురిగొల్పేలా ఉపన్యాసాలు ఇవ్వటం

- రీయింబర్స్ మెంట్ కోసం తప్పుడు బిల్లులు పెట్టటం

- యజమాని ఇచ్చిన భద్రతా పరికరాల్ని ధరించటంలో ఫెయిల్ కావటం