Begin typing your search above and press return to search.

‘దిశ’ విచారణ.. దెబ్బేసేలా ఉందే? ఆసుపత్రిలో చికిత్స అలానా?

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:33 AM GMT
‘దిశ’ విచారణ.. దెబ్బేసేలా ఉందే? ఆసుపత్రిలో చికిత్స అలానా?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ‘దిశ’ ఎన్ కౌంటర్ ఉదంతం ఇప్పుడు పలు మలుపులు తిరుగుతోంది. దారుణమైన రీతిలో హత్యాచారానికిక పాల్పడిన నిందితుల్ని.. కీలక ఆధారాల్ని చూపిస్తామని చెప్పటంతో వారిని తీసుకెళ్లటం.. అక్కడ వారు పారిపోయే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని కాల్చి చంపినట్లుగా పేర్కొనటం తెలిసిందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం కాగా.. కొన్ని వర్గాలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. చట్టబద్ధంగా శిక్షించాల్సింది పోయి.. ఎన్ కౌంటర్ ఎలా చేస్తారన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిర్పుర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసి.. ఎన్ కౌంటర్ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సదరు కమిషన్ తన విచారణను షురూ చేసింది. ఇప్పటివరకు వాంగ్మూలాన్ని ఇచ్చిన సాక్ష్యులు ఎన్ కౌంటర్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించటంలో ఫెయిల్ కావటమే కాదు.. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితుల విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానాలు చెప్పటం లేదన్న మాట వినిపిస్తోంది.

తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసే వేళలో.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు దెబ్బలు తగలటం.. వారిని ఐసీయూలో చేర్చటం తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణ తాజాగా ముగిసింది. అప్పట్లో పోలీసులకు ఐసీయూలో ఉంచి చికిత్స చేసిన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి చెందిన న్యూరో సర్జన్ వివ్వక్ సేన్ రెడ్డిని సిర్పుర్కర్ ను గురువారం విచారణ జరిపారు. కమిషన్ తరఫున న్యాయవాది విరుపాక్ష దత్రాత్రేయ గౌడ్ ఆయన్ను పలు ప్రశ్నలు సంధించారు.

2019 డిసెంబరు ఆరున ఉదయం ఎనిమిది గంటల సమయంలో కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు కానిస్టేబుళ్లు ఇద్దరూ స్పృహలోనే ఉన్నారని.. కుడి కన్నుబొమ్మపై 2 సెంటీమీటర్ల పొడవు గాయమైన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు ఆసుపత్రి ఐసీయూలో పారాసెటమాల్.. కడుపులోని మంటను తగ్గించే పాంటోప్.. ఐవీ ఫ్లూయిడ్ తో చికిత్స చేశామన్నారు. ఇవి తప్ప వేరే చికిత్స చేయలేదన్నారు.

ఇవే విషయాల్ని రికార్డుల్లోనూ నమోదు చేశామన్నారు. నొప్పి.. వాపును తగ్గించే వోవెరాన్.. టీటీ ఇంజెక్షన్లను కానిస్టేబుళ్లు బయటే ఇప్పించుకున్నారని.. కేర్ ఆసుపత్రిలో ఇవ్వలేదన్నారు. గాయాన్ని కొలిచే క్యాలిబర్ తన వద్ద లేకున్నా.. ఒక అంచనాతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సంచలనంగా మారిన మెడికో లీగల్ కేసుల్లో డిశ్చార్జి సమ్మరీలో క్షతగాత్రుల గాయాల గురించి స్పష్టంగా రాయాల్సి ఉన్నా.. మీరెందుకు రాయలేదంటూ కమిషన్ అడిగిన ప్రశ్నకు తాను ప్రస్తుతం సమాధానం చెప్పలేనని డాక్టర్ విశ్వక్ సేన్ రెడ్డి దాటవేశారు.

ఆసుపత్రికి వచ్చిన ఇద్దరుకానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు లేవని.. సాధారణ గాయాలే ఉన్నాయని.. షాద్ నగర్ సీహెచ్ సీ రికార్డ్ లో ఉన్న కానిస్టేబుల్ స్పృహ కోల్పోవటంతో ఐసీయూలో ఆడ్మిట్ చేశామన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఐసీయూలో చేర్చుకున్నామని.. మూడు రోజుల పాటు చికిత్స చేసినట్లు చెప్పారు. కేర్ ఆసుపత్రి రికార్డుల్లో అరవింద్ గౌడ్ కు ఎడమ భుజం మీద సన్నని వెంట్రుక లాంటి చీలిక ఏర్పడితే దాన్ని మీరెందుకు షాద్ నగర్ ఎంఎల్ సీ రికార్డులో నమోదు చేయలేదని ప్రశ్నించగా.. డాక్టర్ నవీన్ సమాధానం చెప్పకుండా పదిహేను నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు.ఇలా పలు విషయాల్లో విచారణ కమిషన్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ రోజు కమిషన్ ఎదుట విచారణకు నాటి సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ హాజరు కానున్నారు.