Begin typing your search above and press return to search.

సూసైడ్ చేసుకునే మహిళను కాపాడిన దిశ యాప్

By:  Tupaki Desk   |   28 Aug 2021 1:30 AM GMT
సూసైడ్ చేసుకునే మహిళను కాపాడిన దిశ యాప్
X
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దిశ యాప్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. తీవ్రమైన మనోవేదనకు గురైన ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయి... ఆ పని చేసినప్పటికి చివరి క్షణంలో దిశ యాప్ తో ఇచ్చిన సమాచారం ఆమె ప్రాణాలు నిలిపేలా చేసింది. తమకుసమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే ఆమె ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటు.. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సేవ్ చేశారు. ఈ ఉదంతంలో పోలీసులు స్పందించిన తీరును పలువురు అభినందిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

విజయవాడకు చెందిన 31 ఏళ్ల జ్ఞానప్రసన్న బ్యాంకు ఉద్యోగి. కొన్నేళ్ల క్రితం భర్తతో విభేదాలు రావటంతో దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్ గా పని చేస్తున్న షేక్ అఖిల్ తో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారటంతో ఇరువురు సహజీవనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అఖిల్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియటంతో ఆమె అఖిల్ వాళ్లింటికి వెళ్లి అతడ్ని ప్రశ్నించింది. దీనికి అతడి తల్లిదండ్రులు ఆమెను కొట్టి.. తిట్టి పంపేశారు. జరిగిన ఉదంతానికి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఇంటికి చేరుకున్న ఆమె అర్థరాత్రి పన్నెండు గంటల సమయంలో శానిటైజర్ తాగా ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగాదిశ యాప్ లో సందేశాన్ని పంపింది. ప్రసన్న నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలోని దిశ అధికారులు వెంటనే స్పందించారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించి.. దగ్గర్లోని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ.. కానిస్టేబుల్.. హోంగార్డులు కలిసి పది నిమిషాల వ్యవధిలోనే ఆమె ఇంటికి చేరుకొని.. ఆమెను దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఆమెతో పాటు ఏడాది వయసున్న పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి.. ఆసుపత్రికి తీసుకెళ్లటంతో ప్రసన్నకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె ఏడాది వయసున్న పాపను అధికారులు సంరక్షణలో ఉంచారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ మాట్లాడే పరిస్థితుల్లోకి ప్రసన్న రాలేదు. దీంతో.. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆమె..కడప జిల్లాకు చెందిన మహిళగా గుర్తించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ యాప్ ద్వారా సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలో స్పందించే అవకాశం ఉందన్న మాటకు తగ్గట్లే తాజా ఉదంతం ఉండటం గమనార్హం.