Begin typing your search above and press return to search.

స్నేహలత నిందితులకు ‘దిశ’ చట్టం వర్తించదా? కారణం ఇదే..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 4:46 PM GMT
స్నేహలత నిందితులకు ‘దిశ’ చట్టం వర్తించదా? కారణం ఇదే..!
X
అనంతపురం జిల్లా ధర్మవరంలో మరో ‘దిశ’ అన్యాయమైపోయింది. స్నేహలత అనే యువతిని దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు రాజేశ్‌తోపాటు, అతనికి సహకరించిన స్నేహితుడు కార్తీక్‌ని కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు వినియోగించిన అపాచీ బైక్‌, 4 సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరం మండలం బడన్నపల్లి సమీపంలోని పొలాల్లో మంగళవారం రాత్రి స్నేహలతను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్యపై ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 201, 302, 34తోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(2)(V) కింద కేసులు నమోదయ్యాయి.

‘దిశ’ చట్టం ఉందా?
పోలీసులు ఐపీసీ సెక్షన్లతో పాటు.. మృతురాలు దళిత వర్గానికి చెందిన యువతి కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో ఎక్కడా ‘దిశ’ చట్టం ప్రస్తావన లేదు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ 13న ‘దిశ’ బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఉదంతం తర్వాత ఈ బిల్లుని రూపొందించారు. మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14రోజుల్లోనే విచారణ పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. సీఆర్పీసీ, ఐపీసీ సెక్షన్లలో పలుమార్పులను ఈ బిల్లులో పొందుపరిచారు. ఏపీకి మాత్రమే వర్తించేలా 354E, 354G సెక్షన్లను చేర్చారు. నిందితులను కఠినంగా శిక్షించేలా ఈ మార్పులు చేసినట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

దిశ’ బిల్లు చట్టం కాలేదు..
ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘దిశ’ బిల్లు చట్టం కావాలంటే.. ఐపీసీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా మారింది. దీంతో.. ఏపీ దిశ యాక్ట్-2019 ని కేంద్రాన్ని పంపింది ఏపీ ప్రభుత్వం. కానీ.. ఒక్క రాష్ట్రం కోసం ఇండియన్ పీనల్ కోడ్ మార్చడానికి కేంద్రం సుముఖంగా లేదని, అందుకే అక్టోబర్‌లో ఆ బిల్లును కేంద్రం వెనక్కి పంపిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

చాలా ప్రక్రియ ఉందట..
“ఏపీ దిశ చట్టంలో అనేక మార్పులున్నాయి. ఐపీసీ సెక్షన్‌ 354కి అదనంగా జోడించిన సెక్షన్ల అమలుకు కేంద్రం అంగీకరిస్తే వివిధ రాష్ట్రాల నుంచి కూడా అలాంటి డిమాండ్‌లు వస్తాయి. అప్పుడు ఐపీసీ సెక్షన్లే ప్రశ్నార్థకం అవుతాయి. కాబట్టి దేశమంతా అమలులో ఉన్న చట్టాలను ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా మార్చాలనే ప్రతిపాదనకు కేంద్రం ససేమీరా అంటోంది’’ అని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. అయినాకూడా.. ఈ చట్టం చేయాలని రాష్ట్రం పట్టుబడితే.. “ఇప్పుడు కేంద్రం వెనక్కి పంపించిన బిల్లుని మరోసారి అసెంబ్లీ ముందుకు తీసుకెళ్లాలి. దానిలో సవరణలను ఆమోదించాలి. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపించాలి. అప్పుడు కేంద్రం అంగీకరిస్తేనే అది చట్టం రూపందాల్చుతుంది’ అని చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం చేసిన మార్పులేంటి..?
ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా యాక్ట్‌ -2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ కోర్ట్‌ ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనెస్ట్‌ విమెన్ అండ్‌ చిల్డ్రన్‌ యాక్ట్‌-2019గా పేర్కొన్న వాటి ప్రకారం ఇందులో అనేక కీలక మార్పులు ఉన్నాయి. దీని ప్రకారం..

నేరం జరిగిన 14 రోజుల్లోపే విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడే విధంగా చట్టాన్ని రూపొందించారు. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదు లేదా ఉరి శిక్షకూ అవకాశం ఉంది. సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడే వారిని శిక్షించడానికి ఐపీసీలో 354(ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం మొదటి అపరాధానికి రెండేళ్లు, రెండో అపరాధానికి నాలుగేళ్ల శిక్ష పడుతుంది. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారి విషయంలో దర్యాప్తును ఏడురోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తి చేసేలా చట్టం తయారు చేశారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాలను త్వరితగతిన విచారించేందుకు వీలుగా, ప్రతి జల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు చట్టం సిద్ధం చేశారు. ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువు ఐపీసీలో ఆరు నెలలు ఉండగా, ఏపీ చట్టంలో దాన్ని3 నెలలకు తగ్గించారు. సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు.

పీపీల నియామకానికి ఛాన్స్..
ప్రతీ ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదు చేసేందుకు డిజిటిల్‌ రిజిస్ట్రీని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడం ద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేసేందుకు వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే.. కేంద్రం ఆమోద ముద్ర వేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం ‘దిశ’ చట్టంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఆశయం మంచిదే అయినా..
రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ‘దిశ’ బిల్లులో మార్పులు సూచిస్తూ కేంద్రం దాన్ని వెనక్కి పంపడం వల్లే అనంతపురంలో హత్యకు గురైన ‘స్నేహలత’ కేసును దిశ చట్టం కింద విచారించడం సాధ్యంకాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. రాష్ట్రం మంచి ఆలోచనతో ఈ చట్టం చేసినప్పటికీ.. కేంద్రం నుంచి క్లియరెన్స్ రాావాల్సి ఉండడంతో అమలుకు నోచుకోవట్లేదు. అయితే.. ‘దిశ’ చట్టం లేకపోయినా ఇలాంటి కేసుల విచారణ సత్వరమే పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.