Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంటే జగనే మహా కఠినం..?

By:  Tupaki Desk   |   17 Oct 2015 5:30 PM GMT
కేసీఆర్ కంటే జగనే మహా కఠినం..?
X
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన పుణ్యమా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ చంద్రబాబు నాయుడు తపించటం పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఆయన గ్రాండ్ గా కార్యక్రమాన్ని జరపకుండా తూతూ మంత్రంగా జరిపితేనే ఆశ్చర్యపోవాలి. ఇక.. శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అమరావతి శంకుస్థాపనకు జగన్ రానని.. తనను పిలవొద్దని.. పిలిచాక రాలేదంటూ బండలేయొద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాయటం తెలిసిందే. బాబు మీద కోపం ఉండటం తప్పేం లేదు కానీ.. అమరావతి మీద జగన్ కు ఇంత అసహనం ఏందన్నది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధినేత తీసుకున్న నిర్ణయంపై జగన్ బ్యాచ్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. కొందరు రాజకీయ నేతల మధ్య సాగిన చర్చ ఇక్కడ ప్రస్తావించాలి. తెలంగాణ.. ఏపీ నేతలు కొద్దిమంది అనుకోకుండా కలిశారు. మాటల మధ్య వారి సంభాషణ అమరావతి శంకుస్థాపన విషయం మీదకు వెళ్లింది. ఆ వెంటనే జగన్ టాపిక్ షురూ అయ్యింది. మీ జగన్ కంటే మా కేసీఆర్ చాలా బెటర్ అని తెలంగాణ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదెలా అంటే.. అమరావతి శంకుస్థాపనకు పిలుస్తానని చెప్పగానే.. మా ముఖ్యమంత్రి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ.. మీ జగన్ మాత్రం సొంతిట్లో పండుగకు నో అనటమేంటి? అంటూ ప్రశ్నించారు.

ఏపీ అంటే అంతెత్తు ఎగిరిపడే కేసీఆర్.. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం విశిష్టత తెలిసినందునే ముందుచూపుతో సానుకూలంగా స్పందించారని.. కానీ.. జగన్ మాత్రం పిల్లాడి మనస్తత్వం నుంచి బయటకు రావటం లేదని.. ఉడుకుమోతుతనం పిల్లాడు కనుక కోపం వస్తే.. ఎలా వ్యవహరిస్తారో అలాంటి ధోరణినే శంకుస్థాపన విషయంలో జగన్ ప్రదర్శిస్తున్నారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు.

దీనికి ఏపీకి చెందిన మరో నేత స్పందిస్తూ.. ఇన్నాళ్లు ఏపీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒళ్లు మంట అనుకున్నామని.. కానీ.. పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ కు మించిన కఠినం జగన్ లో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పంగడ వాతావరణం తన వల్ల చెడిపోకూడదని భావిస్తారని.. కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తుంటే పిల్లాడి మనస్తత్వం నుంచి ఇంకా బయటపడలేదన్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. తాను కోరుకున్నది దక్కని కోపిష్ఠి పిల్లాడు ఉడుకుమోతుతనంతో ఎలా వ్యవహరిస్తారో.. శంకుస్థాపన విషయంలో తాను రానని చెప్పటం ఇంచుమించు ఒకేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళతారో లేదో పక్కన పెడితే.. తనను పిలుస్తానన్న వెంటనే.. సానుకూలంగా స్పందించటం ద్వారా.. తన లొల్లి చంద్రబాబుతోనే కానీ ఏపీ ప్రజలతో కాదన్న సంకేతాల్ని పంపారని.. కానీ.. జగన్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం ఏపీ.. తెలంగాణ నేతలు వ్యక్తం చేయటం గమనార్హం.