Begin typing your search above and press return to search.

నవ్యాంధ్రలో జగన్ ‘నవ’ శకం

By:  Tupaki Desk   |   10 July 2017 11:30 AM GMT
నవ్యాంధ్రలో జగన్ ‘నవ’ శకం
X
వైసీపీ ప్లీనరీకి ముందు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరు... ప్లీనరీ ముగిసిన తరువాత రాష్ర్టంలో పరిస్థితి వేరు. 13 జిల్లాల్లో... 664 మండలాల్లో... 175 నియోజకవర్గాల్లో.. ప్రతి గ్రామంలో ఒకటే చర్చ. ఇంట్లో - వీధిలో - రచ్చబండ వద్ద - కిళ్లీ కొట్టు దగ్గర - పొలంగట్లు మీద - పల్లెవెలుగు బస్సులోన... జనరల్ బోగీ నుంచి ఫస్ట్ ఏసీ బెర్తు వరకు ప్రతి చోటా ఒకటే చర్చ. అది.. వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలు.

రాష్ర్ట విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మూడేళ్ల కిందట బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష అంటూ నానా హడావుడి చేయడమే తప్ప ప్రజలకు, రాష్ర్టానికి చేస్తున్నదేమీ లేదని తేలిపోయిన సందర్భంలో జగన్ ప్రకటించిన ఈ నవ పథకాలు(9 పథకాలు) జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో పూర్తిగా విస్మరించి.. ప్రస్తుత పాలనలోనూ మోసగిస్తున్న రైతుల కోసం జగన్ ప్రకటించిన విధానానికి అంతా సంతోషిస్తున్నారు. జగన్ ను గెలిపిస్తే రైతు ఇంటికి వెలుగొస్తుందని... రైతుల ఆత్మహత్యలతో రికార్డులకెక్కిన ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లేని రాష్ర్టంగా, రైతు రాజయిన రాష్ర్టంగా రికార్డులకెక్కుతుందని అంటున్నారు.

జగన్ ప్రస్తుతానికి ప్రకటించిన 9 పథకాలు చూస్తే ఆయన విజన్ ఏంటో అర్థమైపోతుంది. విజన్ 2050.. విజన్ 3050 అంటూ అప్పటికి ఏమవుతుందో తెలియని... ఎవరికీ గుర్తుండదు కదా అన్న ధీమాతో చెప్పే కల్లబొల్లి మాటలు కాకుండా కచ్చితమైన ప్రయోజనాలు, నిజమైన ప్రయోజనాలు, ఆత్మవిశ్వాసం, భరోసా అందించే పథకాలకు ఆయన రూపకల్పన చేశారని అర్థమవుతోంది.

కాగా జగన్ పథకాలు వినగానే రాష్ర్టంలోని మిగతావర్గాలు కూడా తమ కోసం కూడా జగనన్న పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ రోజు ఉదయం పలు టీవీ ఛానళ్లలో దీనిపై జరిగే చర్చా వేదికలకు ప్రజలు ఫోన్ చేసి దీనిపై మాట్లాడారు. ఆటోవాలాలు తమనూ పట్టించుకోవాలని అడగడం కనిపించింది. అయితే... జగన్ ప్రకటించిన ఈ తొమ్మిది పథకాలు కేవలం తొలి దశ మాత్రమే... ఇదేమీ ఎన్నికల మ్యానిఫెస్టో కాదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మిగతా అన్ని వర్గాలకు కూడా మేలు కలిగేలా పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు వైసీపీ చెబుతోంది.