Begin typing your search above and press return to search.

మంత్రి వ‌ర్గంపై గుస‌గుస‌.. కొత్త మంత్రులపై దృష్టి

By:  Tupaki Desk   |   15 Dec 2021 7:30 AM GMT
మంత్రి వ‌ర్గంపై గుస‌గుస‌.. కొత్త మంత్రులపై దృష్టి
X
ఏపీలో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌నపై మ‌రోసారి వైసీపీలోనే గుస‌గుస వినిపిస్తోంది. నేత‌లు దీనిపై దృష్టిపెట్టారు. ఎందుకంటే.. ఇప్ప‌టికే జిల్లాల‌కుచెందిన కొంద‌రు యువ ఎమ్మెల్యేల ప‌నితీరుపై సీఎం జ‌గ‌న్ నివేదికలు తెప్పించుకున్నార‌ని.. పార్టీలోకొన్ని రోజులుగా చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఇప్పుడు మ‌రో విష‌యం వెలుగు చూసింది.

త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ జాబితాను సిద్ధం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. దీంతో వైసీపీ మంత్రులు.. నాయ‌కుల్లో కొత్త‌వారిపై చ‌ర్చ సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే కొన్ని వెబ్ సైట్ల‌లో చ‌ర్చ కూడా సాగుతోంది. వీరే మంత్రులా? అంటూ.. కొత్త ముఖాల‌తో వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో మ‌రింతగా ఈ విష‌యం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు చూసుకుంటే.. గుంటూరు నుంచి ఒక ఎమ్మెల్సీకి, ఒక ఎమ్మెల్యేకి అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ముఖ్యం గా ఇటీవ‌ల టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీలో చేరిన మురుగుడు హ‌నుమంత‌రావుకు అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు.

త‌ద్వారా.. మంగ‌ళ‌గిరిలో చేనేత వ‌ర్గాన్ని వైసీపీ త‌న‌వైపు తిప్పుకొనేందుకు మ‌రింత అవ‌కాశం ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి లోకేష్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

ఇక‌, తూర్పుగోదావ‌రి నుంచి జ‌క్కం పూడి రాజాకు అవ‌కాశం ఇచ్చే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న సాగుతోంది. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ద్ద‌ని సొంత పార్టీ నేత‌లే.. ప్ర‌తిపాద‌నలు పంపిన‌ట్టు స‌మాచారం. దీంతో ఆయ‌న‌పై ఏం చేస్తార‌ని చ‌ర్చ సాగుతోంది.

ఇక‌, క‌డ‌ప నుంచి కోరుముట్ల శ్రీనివాసుల‌ను తీసుకునే అవ‌కాశం పుష్క‌లంగా క‌నిపిస్తోంది. ఎస్సీ కోటాలో ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే పార్టీలోనూ చ‌ర్చ సాగుతోంది. అదేస‌మ‌యంలో శ్రీకాకుళం నుంచి రెడ్డి శాంతి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆమెకు కూడా ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, విజ‌య‌వాడ నుంచి మ‌ల్లాది విష్ణుకు అవ‌కాశం ఇవ్వ‌డం త‌థ్య‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వెలంప‌ల్లి శ్రీనివాస్ స్థానంలో మాత్రం ఎవ‌రిని నియ‌మిస్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. ముందుగా కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామిని అనుకున్నా.. ఆయ‌న స్థానంలో మ‌రోపేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. దీంతో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇక‌, ఎస్టీ సామాజిక‌వ‌ర్గంలో పోల‌వ‌రం నుంచి ఎన్నికైన సీనియ‌ర్ నాయ‌కుడికి అవ‌కాశం ఇస్తార‌ని అంటున్నారు. ఇక్క‌డ పార్టీకీల‌కంగా ఎదుగుతున్న ద‌శ‌లో ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పార్టీని ప‌రుగులుపెట్టించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక‌, క‌మ్మ వ‌ర్గానికి వ‌స్తే.. కొడాలి నానిని కొన‌సాగిస్తార‌ని అంటున్నారు.

రోజాకు ఈ ద‌ఫా కూడా ఆశ ఫ‌లించే అవ‌కాశం లేదు. అదేవిధంగా భూమ‌న‌, చెవిరెడ్డి వంటివారికి కూడా అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక‌, యాద‌వ సామాజిక వ‌ర్గం నుంచి కొలుసు పార్థ‌సార‌థికి అవ‌కాశం ఫిఫ్టీ ఫిఫ్టీగా క‌నిపిస్తోంది. మొత్తంగా ఆశావ‌హుల జాబితాలో ఉన్న‌వారి కంటే కూడా.. పార్టీ కోసం ప‌నిచేస్తున్న‌వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో ఈ జాబితా రెడీ అయింద‌ని చెబుతున్నారు.