Begin typing your search above and press return to search.

నిజంగానే.. ఒక లిక్కర్ బాటిల్ కొంటే మరొకటి ఫ్రీ

By:  Tupaki Desk   |   30 Sep 2019 11:35 AM GMT
నిజంగానే.. ఒక లిక్కర్ బాటిల్ కొంటే మరొకటి ఫ్రీ
X
ఇంతకు ముందు ఎప్పుడూ.. ఎక్కడా వినని డిస్కౌంట్ సేల్ ఏపీలో నడుస్తుంది. వివిధ రకాల వస్తువులకు డిస్కౌంట్ సేల్ చూసి ఉంటాం కానీ.. లిక్కర్ షాపుల విషయంలో మాత్రం అలాంటిది ఎప్పుడూ విని ఉండం. కానీ.. ఆ లోటు తీర్చేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంలో భాగంగా ఈ రోజు (సోమవారం) రాత్రి 10 గంటల లోపు.. అన్ని మద్యం దుకాణాల్లో ఉన్న స్టాకును అమ్మేసుకోవాలన్న ఆదేశాల నేపథ్యంలో.. భారీ డిస్కౌంట్ సేల్ కు తెర తీశారు.

అక్టోబరు 1 నుంచి ఏపీ ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం మద్యం షాపులు నిర్వహిస్తున్న వారంతా తమ వద్ద ఉన్న స్టాక్ మొత్తాన్ని అమ్మేసుకోవాల్సి ఉంటుంది. దీంతో.. తమ దగ్గరున్న స్టాక్ ను క్లియర్ చేసుకునే పనిలో భాగంగా భారీ రాయితీలకు తెర తీశారు. ఇందులో భాగంగా కనివిని ఎరుగని రీతిలో ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీతో పాటు.. పలు ఆకర్షణీయమైన రాయితీల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

కొందరు వ్యాపారస్తులైతే.. ప్రీమియం బాటిల్ పైన రూ.వెయ్యి వరకూ డిస్కౌంట్ చేసి అమ్మేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో.. షాపుల ముందు క్యూ కట్టి మరీ మందు బాటిళ్లను భారీగా కొనేస్తున్నారు. మద్యం వ్యాపారులు ఎందుకిలా చేస్తున్నారు? అన్న క్వశ్చన్ కు ఆన్సర్ వెతికితే సమాధానం భలే ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.

అదేమంటే..ఈ రోజు (సోమవారం) రాత్రి 10 గంటల లోపు మద్యం దుకాణాల్లో స్టాక్ ఎంత అమ్ముతారో ఆ మొత్తాన్ని వ్యాపారస్తులే తీసుకునే వీలుంది. కానీ.. రాత్రి 10 గంటల తర్వాత మిగిలిన స్టాక్ మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. దీనిపై ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వదు.

అంటే.. మిగిలిపోయిన స్టాక్ కు చిల్లిగవ్వ కూడా వెనక్కి రాదన్న మాట. ఈ కారణంతోనే.. ఎంత వస్తే అంత దక్కుదల అన్న చందంగా భారీ ఎత్తున రాయితీలకు మద్యాన్ని అమ్మేస్తున్నారు. దీనికి తగ్గట్లే.. ఇంత కారుచౌకగా వస్తున్న మద్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు మందుబాబులు. ఈ విషయం మీద కాస్త ప్రచారం భారీగా జరిగి ఉంటే.. ఇతర రాష్ట్రాల వారు పెద్ద ఎత్తున వచ్చి కొనుగోళ్లు చేసుకునే వారేమో?