Begin typing your search above and press return to search.

ఏపీ లిక్కర్ షాపుల్లో డిస్కౌంట్ సేల్..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   11 Sep 2019 5:36 AM GMT
ఏపీ లిక్కర్ షాపుల్లో డిస్కౌంట్ సేల్..ఎందుకంటే?
X
డిస్కౌంట్లు.. ఒకటి కొంటే ఒకటి ఉచితాలు.. గిఫ్టులు.. ఇలాంటివి చాలానే షాపుల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ.. ఇంతకు ముందెప్పుడూ చూడని రీతిలో ఏపీలోని లిక్కర్ షాపులు తయారవుతున్నాయి. మిగిలిన దుకాణాల మాదిరి ఏపీలోని లిక్కర్ షాపులు డిస్కౌంట్లు.. ఉచిత బహుమతుల్ని ప్రకటిస్తూ మందుబాబుల్ని తెగ ఊరిస్తున్నారు. అంతేనా.. వీరి జోరుతో సరిహద్దు రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఫుల్ గా మందేస్తున్నారు. ఎక్కడ డిస్కౌంట్లు ఇచ్చినా.. లిక్కర్ షాపుల్లో డిస్కౌంట్లు ఇవ్వకపోగా.. అప్పుడప్పుడు నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేయటం చూస్తుంటా.

అందుకు భిన్నంగా ఇప్పుడు మాత్రం బాటిల్ మీద గరిష్ఠంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ మీద అమ్మకాలు చేస్తున్న వైనం ఇప్పుడక్కడ దర్శనమిస్తోంది. ఎందుకిలా? లిక్కర్ షాపుల్లో డిస్కౌంట్ సేలా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. ఏపీలోని జగన్ సర్కారు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఒక కార్యక్రమాన్ని చేపట్టటం.. దశల వారీగా ఆ ప్రయత్నాన్ని పూర్తి చేయాలనుకోవటం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వారందరికి ఏపీ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. మద్యందుకాణాల్లో ఉన్న సరకు మొత్తాన్ని అక్టోబరు 1 నాటికిపూర్తి చేయాలని చెప్పారు. అంటే.. మద్యం దుకాణాల్లో ఒక్క సీసా మిగలకుండా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.

అక్టోబరు 1 నుంచి సర్కారే మద్యం దుకాణాల్ని నిర్వహించనున్న నేపథ్యంలో.. ఇప్పుడు షాపులు నిర్వహిస్తున్న వారు తమ దగ్గర ఉన్న స్టాక్ ను క్లియరెన్స్ సేల్ పెట్టేస్తున్నారు. ఇందులో భాగంగా పలు బ్రాండ్లకు 30 శాతం వరకూ రాయితీ ఇచ్చేందుకు సైతం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే.. తమ దగ్గరున్న స్టాక్ ను ఈ నెలాఖరులోపు అమ్మకపోతే.. ఆ తర్వాత వాటిని అమ్మేందుకు అవకాశం ఉండదు.

దీంతో ఏపీలోని మద్యం షాపుల వారు.. తమ వద్ద ఉన్న స్టాక్ కు క్లియరెన్స్ సేల్స్ పెట్టేశారు. తాజా పరిణామాలతో ఏపీలోని పలు మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొంది. క్లియరెన్స్ సేల్ కు సంబంధించిన విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు రావటంతో.. దగ్గరున్న రాష్ట్రాల వారు ఏపీకి వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేయటం ఖాయం. అదే జరిగితే.. ఏపీ క్లియరెన్స్ సేల్ రానున్న రోజుల్లో తెలంగాణకు తలనొప్పిలా మారే ప్రమాదం ఉందంటున్నారు.