Begin typing your search above and press return to search.

రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. డాక్టర్లు ఏమంటున్నారంటే..?

By:  Tupaki Desk   |   22 Nov 2021 2:30 AM GMT
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. డాక్టర్లు ఏమంటున్నారంటే..?
X
సోషల్ మీడియా ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా తయారుచేసింది. మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన కూడా క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అయితే దీనితో ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉన్నాయి. వ్యక్తిగత గోప్యతకు ఆస్కారం లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రముఖుల ప్రైవసీకి సామాజిక మాధ్యమాలు కొరకరాని కొయ్యగా మారాయి. ఇసుమంత కనిపిస్తే చాలు.. దాన్ని కొండంత చేస్తున్నారు. ఫలితంగా సెలబ్రెటీలు ఫేక్ వార్తలను స్వయంగా ఖండించాల్సి వస్తోంది. లేదంటే వాటినే నిజం అని సృష్టిస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్ రాణికి కూడా ఇలాంటి అసౌకర్యం కలిగింది. ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూసిన పలువురు ఆమె అనారోగ్యం బారిన పడిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటిపై పలువురు వైద్యులు స్పందించారు.

లండన్ లోని విండ్ సర్ కాస్టిల్ లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్ తో ఈ నెల 19న ఆమె సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వారిద్దరూ భేటీ అయిన సమయంలో తీసిన చిత్రాలను బకింగ్ హమ్ ప్యాలెస్ రిలీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి రచ్చ మొదలైంది. క్వీన్ ఎలిజబెత్ కు ఆరోగ్యం క్షీణించిందని కొందరూ... ఆమెకు ఓ వ్యాధి వచ్చిందని మరి కొందరు రకరకాలు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎందుకు అంటున్నారంటే.. ఆమె చేతులు స్వల్పంగా రంగు మారాయి అంతే. ఆమె ముఖం రంగుతో పోల్చితే చేతుల రంగులో తేడా కనిపించడం వల్ల ఏదేదో ఊహించుకుంటున్నారు. పైగా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. రంగుమారిన క్వీన్ ఎలిజబెత్ చేతుల ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

క్వీన్ ఎలిజబెత్ రాణి చేతులు రంగుమారడంపై వైద్యులు నిపుణులు ఒక్కక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎక్కువగా చలి ఉండడం వల్ల కలర్ ఛేంజ్ అయిఉంటుందని షేక్‌స్పియ‌ర్ మెడిక‌ల్ సెంట‌ర్‌ కు చెందిన డాక్టర్ జై వర్మ తెలిపారు. రెనాడ్స్ అనే వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జలుబు, ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోతే రంగు మారుతాయని జాన్ హోప్‌కిన్స్ మెడిసిన్ సైట్ వైద్యులు వెల్లడించారు. చేతులు రంగు మారడం అనేది పెద్ద సీరియస్ విషయం కాదని నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్, యూకే వైద్యులు పేర్కొన్నారు. అయితే వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. వేడి తగిలితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వివరించారు. ఈ విధంగా వైద్యుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో వల్ల ఇంతమంది వైద్య నిపుణులు స్పందించారు. ఇకపోతే రంగు మారితే పెద్దగా ప్రమాదం ఏమీ లేదని అంటున్నారు. అయితే గతకొంత కాలంగా క్వీన్ ఎలిజబెత్ కు ఆరోగ్యం బాగాలేదని వార్తలు రావడం గమనార్హం. అనారోగ్యం కారణంగానే విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సమయంలోనే చేతులు రంగు మారిన ఫొటో నెట్టింట వైరల్ గా మారడం సంచలనంగా మారింది.