Begin typing your search above and press return to search.

సన్మాన సభలో మోడీ ఏం చెప్పారంటే..?

By:  Tupaki Desk   |   24 July 2016 10:46 AM GMT
సన్మాన సభలో మోడీ ఏం చెప్పారంటే..?
X
కీలక స్థానాల్లో ఉండే వారిని పారిశ్రామికవేత్తలు.. వ్యాపార వర్గాలు సాదరంగాఆహ్వానించటం.. వారికి సన్మానం చేయటం.. తమ వినతుల్ని ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లటం.. పనిలో పనిగా తమకు సానుకూలంగా ఉండే అంశాలపై కీలకనిర్ణయాలు తీసుకోవాలని కోరటం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి పప్పులు ప్రధాని మోడీ దగ్గర ఉడకవన్న విషయం తాజాగా జ్యూయలరీ వ్యాపారులకు బాగానే అర్థమై ఉంటుంది. దేశంలో పన్ను చెల్లించకుండా.. తమ వ్యాపారాల్ని పారదర్శకంగా జరపని వ్యాపారాల్లో జ్యూయలరీ షాపులు ఒకటన్న ఆరోపణ ఉంది. జ్యూయలరీ వ్యాపారులు కానీ చట్టబద్ధంగా తమ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే.. ఇప్పటి వరకూ వారి నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయానికి మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువ మొత్తం వస్తుందన్న అభిప్రాయం ఉంది.

ఈ విషయం మీద ప్రధాని మోడీకి కూడా అనుభవం ఉన్నట్లుగా కనిపిస్తుంది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని నిశితంగా పరిశీలిస్తే.. ఈవిషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు. తనను సన్మానించిన నగల వ్యాపారుల్ని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా నల్లధనాన్ని పోగిసుకున్న వారిపై నేరుగా వార్నింగ్ ఇవ్వటమే కాదు.. ‘‘హాయిగా నిద్రపోవాలని అనుకుంటున్నారా? నిద్ర లేని రాత్రుల్ని గడపాలని అనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించటం గమనార్హం.

నల్ల కుబేరులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాల్ని స్పష్టంగా ఇవ్వటంతో పాటు.. ఇప్పటివరకూ జరిగిందేదో జరిగిపోయిందని.. సెప్టెంబర్ 30న ముగుస్తున్న క్షమాభిక్ష స్కీంను సద్వినియోగంవ చేసుకోవాలని ఆయన కోరటం గమనార్హం. పన్ను చెల్లింపు దారులను ఎగవేతదారులుగా అవమానించటం తనకు ఇష్టం లేదని.. ప్రజలపై నిఘా కన్ను వేయటం తన అభిమతం కాదన్న మోడీ.. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా చెల్లింపులు జరిపితే సరిపోతుందన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

స్థిరాస్తి వ్యాపారం..జ్యూయలరీ.. నగదు రూపంలో పెద్ద ఎత్తున పోగేసిన మొత్తాన్ని ప్రభుత్వం పేర్కొన్నట్లుగా గడువు తేదీలోపల పన్ను మొత్తాన్ని స్వచ్ఛందంగా చెల్లిస్తే.. గుండెల మీద చేతులు వేసుకొని హాయిగా నిద్రపోవచ్చని ప్రధాని చెప్పటం చూస్తే.. నల్ల కుబేరుల మీద రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ప్రజలు.. వర్తకుల దగ్గర కలిపి దాదాపు 20 వేలటన్నుల బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఓపెన్ గా నల్లకుబేరుల గురించిచెప్పి.. వారిపై తాను తీసుకునే చర్యల గురించి చెప్పిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.