Begin typing your search above and press return to search.

నా పనులు నేనే చేసుకుంటా , వైకల్యం నన్ను అడ్డుకోలేదు : ‌ మాళవికా అయ్యర్ ‌

By:  Tupaki Desk   |   4 Dec 2020 11:30 PM GMT
నా పనులు నేనే చేసుకుంటా , వైకల్యం నన్ను అడ్డుకోలేదు : ‌ మాళవికా అయ్యర్ ‌
X
శారీరక వైకల్యం శాపం అనుకుంటారు. నిజానికి వికలాంగులను చూసి నానా మాటలూ అనే మానసిక వైకల్యమే అన్నింటి కంటే పెద్ద శాపం అని అంటారు అంతర్జాతీయ మోటివేషనల్‌ స్పీకర్‌ డాక్టర్‌ మాళవిక అయ్యర్‌. పదమూడేళ్ల వయస్సులోనే అర చేతులు కోల్పోయినప్పటికీ ధైర్యంతో ముందుకు సాగి గొప్ప వక్తగా ఎదిగారు. సామాజిక శాస్త్రంలో డాక్టరేట్‌ పొంది దివ్యాంగులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

పద్దెనిమిదేళ్ల క్రితం నా రెండు చేతులు రక్తపు మడుగులో మునిగిపోయినపుడు నేను అంతగా ఏడ్వలేదు. డాక్టర్లు నా చేతుల్లో ఇనుప రాడ్లు వేసినపుడు కూడా ఎక్కువ బాధ పడలేదు. కానీ ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నపుడు నా పక్కనున్న ఆడవాళ్లు మాట్లాడిన మాటలు విని వెక్కివెక్కి ఏడ్చాను. జనరల్‌ వార్డులో కొత్త అమ్మాయి చేరిందట. తను నిజంగా శాపగ్రస్తురాలే. ఇక తన జీవితం ముగిసిపోయినట్లే’ అంటూ నా గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే మొదటిసారిగా నా కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీళ్లు కారాయి. గ్రెనేడ్‌ పేలుడులో అర చేతులు కోల్పోయిన నాకు భవిష్యత్తే లేదన్నట్లుగా వారు మాట్లాడారు. ఆ మాటలను అంగీకరించడానికి నా హృదయం అప్పుడు సిద్ధంగానే ఉంది. అయితే నా కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం నాలో కొత్త ఉత్సాహం నింపింది. వారి చొరవతోనే నేనింత వరకు రాగలిగాను అని అంటారు మాళవికా. వైకల్యం అనేది నేను చేయాలనుకున్న పనులు చేయకుండా నన్ను అడ్డుకోలేదు అంటూ దివ్యాంగుల్లో స్ఫూర్తి నింపారు. డిసెంబరు 3న వరల్డ్‌ డిజెబిలిటీ డే సందర్భంగా తన పనులు తానే చేసుకుంటున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

వివిధ దేశాల్లో ప్రసంగాలు చేసిన మాళవిక.. సమాజ తీరు, మహిళలు, దివ్యాంగులపై వివక్ష వంటి అంశాలపై ఐక్యరాజ్యసమితిలోనూ తన గళాన్ని బలంగా వినిపించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా అత్యున్నత మహిళా పురస్కారం నారీ శక్తి పురస్కార్‌ తో సత్కరించింది. మాళవిక అయ్యర్‌ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ణన్, హేమా క్రిష్ణన్‌. తండ్రి వాటర్‌ వర్క్స్‌లో ఇంజనీరుగా పనిచేసిన క్రమంలో మాళవిక బాల్యం రాజస్తాన్ ‌లోని బికనీర్‌లో గడిచింది. అక్కడ ఉన్నపుడే ఓ రోజు తమ గ్యారేజీలో ఆడుకుంటున్న సమయంలో గ్రానైడ్‌ చేతుల్లో పేలింది. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ ఉన్నత విద్య కోసం ఢిల్లీకి చేరకున్న మాళవిక... ఎకనమిక్స్‌ హానర్స్‌ చదివారు. సోషల్‌ వర్క్‌లో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సంపాదించారు. 2013 నుంచి మోటివేషనల్‌ స్పీకర్ ‌గా మారి ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.