Begin typing your search above and press return to search.

తెలంగాణ సర్కారు షాకింగ్ నిర్ణయం

By:  Tupaki Desk   |   23 July 2015 9:11 AM GMT
తెలంగాణ సర్కారు షాకింగ్ నిర్ణయం
X
పథకం మంచిదే కానీ.. దాని కోసం పెడుతున్న ఖర్చు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్ నగరంలో చెత్త తరలించడం కోసం ప్రతి ఇంటికీ రెండు పెద్ద డబ్బాల్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. తడి చెత్త, పొడి చెత్త కోసం పెద్ద పెద్ద డబ్బాల్ని ప్రతి ఇంటికీ ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఐతే ఈ డబ్బాల కొనుగోలుకు ఏకంగా రూ.42 కోట్లు ఖర్చు చేయబోతుండటం విశేషం. ఫ్రీజింగ్ ప్రభావం వల్ల అత్యవసర చెల్లింపులు మినహా అన్ని కార్యక్రమాలకు నిధులు ఆపివేస్తూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి ఇటీవలే అధికారులకు ఆదేశాలు అందిన సంగతి తెలిసిందే. ఖజానా పరిస్థితి అలా ఉన్న సమయం చెత్త డబ్బాల పథకానికి ఏకంగా రూ.42 కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

స్వచ్ఛ హైదరాబాద్ మిషన్లో భాగంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమిది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 40 లక్షల చెత్త డబ్బాలు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఇతర అవసరాలకు ఇంకో 5 లక్షల డబ్బాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఈ మొత్తం డబ్బాలకయ్యే ఖర్చుకు సంబంధించి కొటేషన్లు తీసుకున్నారు. తక్కువలో తక్కువ ఒక్కో డబ్బాకు 94 రూపాయలు ఖర్చవుతుంది. దీని ప్రకారం మొత్తం డబ్బాలకు రూ.42 కోట్లు అవుతుందని లెక్కగట్టారు. చెత్త డబ్బాల కొనుగోలుకు టెండర్లు పిలిచేందుకు పాలనాపరమైన అనుమతులిస్తూ పురపాలిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో టెండర్లు పిలిచి త్వరలోనే చెత్త డబ్బాలు కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. జనాలు తడి, పొడి చెత్తను వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేస్తే వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి చెత్త సేకరిస్తారు.