Begin typing your search above and press return to search.

ఆ కీలక సవరణలతో అసెంబ్లీ ముందుకు మరోసారి 'దిశ బిల్లు'

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:50 AM GMT
ఆ కీలక సవరణలతో  అసెంబ్లీ ముందుకు మరోసారి దిశ బిల్లు
X
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం .. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని , తీసుకువచ్చిన దిశ బిల్లుని కేంద్రం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే , తాజాగా ఈ రోజు ఆ దిశ బిల్లుని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గతంలో బిల్లులో పొందుపరిచిన పలు అంశాల్లో సవరణలు చేస్తూ దిశ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు తీసుకువచ్చింది. ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో దిశ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు.

ఈ దిశ బిల్లు పై అసెంబ్లీలో చర్చించాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. అయితే స్పీకర్‌ తమ్మినేని సీతారాం అందుకు అంగీకారం తెలుపలేదు. టీడీపీ సభ్యులు ఎంతగా పట్టుబట్టినా స్పీకర్‌ మాత్రం చర్చకు ఒప్పుకోలేదు. దీన్ని కారణంగా చూపిస్తూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష టీడీపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

ఇకపోతే, మరోవైపు ఈసారి దిశ చట్టంలో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుల కొనసాగించాలని నిర్ణయించారు. కానీ దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లను మాత్రం ఎత్తేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వాస్తవానికి బిల్లు అమల్లోకి రాకుండానే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన పోలీసు స్టేషన్లు, కోర్టులపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నింటికంటే మించి గతంలో బిల్లులో ప్రతిపాదించిన 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నిబందనను కూడా ప్రభుత్వం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ఈ సవరణ బిల్లుపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశా చట్టాన్ని తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది.