Begin typing your search above and press return to search.

సచిన్ ఇచ్చిన కారు వెనక్కి ఇచ్చేస్తోందట!

By:  Tupaki Desk   |   12 Oct 2016 12:43 PM IST
సచిన్ ఇచ్చిన కారు వెనక్కి ఇచ్చేస్తోందట!
X
రియో ఒలింపిక్స్‌ లో అద్భుత ప్రతిభ కనబర్చిన పీవీ సింధు - దీపా కర్మాకర్‌ - సాక్షి మాలిక్‌ లకు క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ చేతుల మీదుగా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కానుకగా అందిన విషయం తెలిసిందే. అయితే జిమ్నాస్టిక్స్‌ లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందిన దీపా కర్మాకర్ సచిన్ చేతుల మీదుగా బహుకరించిన బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుందట. దీనికి కారణం మరేమిటో కాదు, ఆ కారును మెయింటెన్ చేయలేకపోవడమేనట. అంత ఖరీదైన కారును అగర్తలా వంటి చిన్న నగరంలోని రోడ్లపై నడపడం కష్టమని, ఆ ప్రాంతంలో రోడ్డుపై ఎక్కువగా గుంతలు - ఎత్తుపల్లాలు ఉంటాయని, దీంతో ఈ కారుతో ప్రయాణించడం కష్టమైన పనని, ఇదే సమయంలో విలాసవంతమైన ఈ కారును మెయింటెన్ చేయడం కూడా కష్టంగా మారుతుందని ఆమె అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

అయితే... ఆమె ప్రాంతంలోని రోడ్లపై బీఎండబ్ల్యూను నడిపితే అనవసరంగా పాడవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికొచ్చిందని - అంతేకాకుండా అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదని, అందుకే ఆమె కారును తిరిగిచ్చేదామనుకుంటోందని, ఇదే విషయాన్ని చాముండేశ్వరి నాథ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కోచ్ బిశ్వేస్వర్ నంది మీడియాకు వెల్లడించారు. అయితే ఈ విషయాలపై స్పందించిన చాముడేశ్వరీనాథ్... కారు ఇబ్బందిగా అనిపిస్తే, ఆ కారు ఖరీదు చేసే డబ్బును దీపా అకౌంట్లో వేస్తానని చెప్పారట. కాగా, రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్ కు - సింధు - సాక్షిలతోపాటు బీఎండబ్ల్యూ కారును హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్‌ బహూకరించిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/