Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రిలో ఒక‌రే యూపీ సీఎం

By:  Tupaki Desk   |   14 March 2017 4:39 AM GMT
ఆ ఇద్ద‌రిలో ఒక‌రే యూపీ సీఎం
X
ఉత్త‌ర‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. సీఎం అభ్యర్థి ఎవరన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో సొమ్ముచేసుకున్న వివిధ సామాజిక వర్గాల మద్దతును 2019 లోక్‌ సభ ఎన్నికలకు పునాదిగా మలుచుకోవాలని భావిస్తున్న కమలనాథులకు సీఎం ఎంపిక‌తో అసలు పరీక్ష మొదలయింది. సరైన నేత కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రంలో వివిధ వర్గాల అభిప్రాయాలతో ప్రధాని నరేంద్రమోడీకి సవివరమైన నివేదికను అందజేసిందని స‌మాచారం.

ఎంబీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఆయా సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడంలో సక్సెసయ్యారు. సీఎం పదవిపై మౌర్య తన ఆకాంక్షలు కొట్టి పారేయకున్నా పార్టీ నాయకత్వానిదే తుది నిర్ణయమన్నారు. అగ్రవర్ణాలకు చెందిన నాయకులతో పోలిస్తే వివాద రహితుడన్న పేరు మౌర్యకు ఉన్నది. ఆడంబరాలకు దూరంగా ఉండే లక్నో మేయర్ దినేశ్ శర్మ.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా గుజరాత్ వ్యవహారాల పార్టీ ఇన్‌ చార్జిగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా - ప్రధాని మోడీని ఆకట్టుకున్నారు. వీరిద్ద‌రికీ ఎక్కువ చాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. భూమిహార్ బ్రాహ్మణ నేత కేంద్రమంత్రి మనోజ్ సిన్హాకు గ్రామీణులను ఆకట్టుకోగల నేత అని ముద్ర ఉంది. ఇక మాజీ ప్రధాని ఎల్‌ బీ శాస్త్రి మనుమడు సిద్ధార్థ్‌ నాథ్ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతోపాటు కాయస్థ సామాజిక వర్గ నాయకుడు.

ఇదిలాఉండ‌గా...ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మాజీ ప్ర‌ధాని - మాజీ సీఎంలకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు పోటీచేయగా వారిలో ఐదుగురు విజయం సాధించారు. మిగతా ముగ్గురినీ ఓటర్లు తిరస్కరించారు. వారిలో ఏడుగురు సీఎంల దగ్గరి బంధువులు. కాగా ఒకరు మాజీ ప్రధాని లాల్‌ బహదూర్ శాస్త్రి మనుమడు. రీటాజోషి (హెచ్‌ ఎన్ బహుగుణ కుమార్తె) - సందీప్‌ కుమార్‌ సింగ్ (కళ్యాణ్‌ సింగ్ మనుమడు) - పంకజ్‌ సింగ్ (రాజ్‌ నాథ్‌ సింగ్ కుమారుడు) - సిద్ధార్థనాథ్‌ సింగ్ (లాల్‌ బహదూర్‌ శాస్త్రి మనుమడు). సమాజ్‌ వాదీపార్టీ తరఫున శివపాల్ యాదవ్ - అనురాగ్ యాదవ్ - అపర్ణా యాదవ్ (ములాయం తమ్ముడు - మేనల్లుడు - చిన్నకోడలు) పోటీచేశారు. కాంగ్రెస్ తరఫున లలితేశ్‌ పతి త్రిపాఠి (కమలాపతి త్రిపాఠి మునిమనుమడు) రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున పోటీచేసిన నలుగురూ గెలువగా అనురాగ్ - అపర్ణ లలితేశ్‌ పతి త్రిపాఠి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/