Begin typing your search above and press return to search.

ఈపీఎస్ కొంప కొల్లేరైపోయిందే!

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:27 PM GMT
ఈపీఎస్ కొంప కొల్లేరైపోయిందే!
X
త‌మిళ‌నాడులో ఇప్పుడు ఏ రోజు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం చెప్ప‌డానికి వీల్లేదు. ఎందుకంటే... అన్నాడీఎంకే అధినేత్రి, దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ రాజ‌కీయ అస్థిర‌త నెల‌కొంద‌న్న మాట కాద‌న‌లేనిదే. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత ఆమె న‌మ్మిన‌బంటుగా ఉన్న ఓ ప‌న్నీర్ సెల్వం సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా... కొన్ని రోజుల‌కే సీన్ పూర్తిగా మారిపోయింది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ ఎంట్రీ ఇచ్చేసి... ఓపీఎస్‌ ను సీఎం పీఠం నుంచి దించేసి... త‌న‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్న ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామికి అధికార ప‌గ్గాలిచ్చేసింది. ఈ క్ర‌మంలో ఓపీఎస్ వేరు కుంప‌టి పెట్టేసుకున్నారు. ఆ త‌ర్వాత ప‌లు నాట‌కీయ ప‌రిణామాల‌తో జ‌య‌ల‌లిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శ‌శిక‌ళ‌... బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలులో రెస్ట్ తీసుకుంటున్నారు.

జైలుకెళ్లే సంద‌ర్భంగా త‌న మేన‌ల్లుడు టీవీవీ దిన‌క‌ర‌న్ ను పార్టీ ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించిన జ‌య‌... పార్టీపై త‌న ప‌ట్టు నిలుపుకునేందుకు ప‌క్కా ప‌థ‌కం ర‌చించారు. ఈ క్ర‌మంలో జ‌య బ‌తికుండ‌గా ఒక్క‌టిగానే ఉన్న అన్నాడీఎంకే ఇప్పుడు... ముచ్చ‌ట‌గా మూడు ముక్క‌లైపోయింది. వాటిలో అమ్మ న‌మ్మిన‌బంటు ఓపీఎస్‌ కు చెందినది ఓ వ‌ర్గం కాగా... ప్ర‌స్తుత సీఎం ఈపీఎస్ వ‌ర్గం మ‌రొక‌టిగా ఉంది. ఇక ముచ్చ‌ట‌గా మూడో వ‌ర్గం... శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్‌ల‌తో కూడా వ‌ర్గ‌మ‌న్న మాట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేకు సంపూర్ణ మెజారిటీ వ‌చ్చినా... ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మూడు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో అస‌లు ప‌ళ‌నిసామి ప్ర‌భుత్వానికి స‌రిప‌డ మెజారిటీ ఉందా? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

అయితే ఒక వేళ ప‌ళ‌నిసామి ప్ర‌భుత్వం మెజారిటీ లేక ప‌డిపోయినా... ఆ వెంట‌నే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే స్తోమ‌త అటు విప‌క్షం డీఎంకేతో పాటు అన్నాడీఎంకేలోని రెండు వ‌ర్గాల‌కు లేక‌పోవ‌డంతో ఏ ఒక్క‌రు కూడా కిమ్మ‌న‌కుండానే ఉండిపోయారు. ఈ క్ర‌మంలో ఈపీఎస్ స‌ర్కారుకు అస‌లు మెజారిటీనే లేద‌ని, ఇప్ప‌టికిప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌న్న ఓ స‌రికొత్త వాద‌న బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ వాద‌న‌ను వినిపించిన వ్య‌క్తులు బ‌య‌టి వ్య‌క్తులెవ‌రో కాదు... నిత్యం ఈపీఎస్‌ తో ఉంటూనే ఆయ‌న కేబినెట్ లో ఓ కీల‌క మంత్రిగా ఉన్న నేతే ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశారు. అది కూడా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ఆ మంత్రి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఆ మంత్రి ఎవ‌రు... ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న త‌మిళ‌నాడు మంత్రి దిండుగ‌ల్ శ్రీ‌నివాసన్‌... త‌మ స‌ర్కారుకు ఏ పాటి మ‌ద్ద‌తుందో ఇట్టే చెప్పేశారు. అయినా శ్రీ‌నివాస‌న్ ఏమ‌న్నారంటే... ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే 117 మంది ఎమ్మెల్యేలు అవసరం అని శ్రీ‌నివాస్ చెప్పారు. అయితే త‌మ‌కు ఇప్పుడు 115 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శ్రీనివాసన్ అన్నారు. పూర్తి మెజారిటీకి త‌క్కువ‌గా ఉన్న ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా త్వరలో త‌మ గూటికి చేరుకుంటారని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే... టీటీవీ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక విభాగం ప్రధాన కార్యదర్శి పూహళేంది మీడియాతో మాట్లాడుతూ త‌మ‌ వర్గంలోని నలుగురు ఎమ్మెల్యేలను మంత్రి ఉదయ్ కుమార్ మభ్యపెట్టి తీసుకెళ్లారని, త్వరలో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది త‌మ‌ గూటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే జ‌రిగితే... ఇప్పుడు మైన‌స్ 2గా ఉన్న ఈపీఎస్ మెజారిటీ -6కు చేరుతుంద‌న్న మాట‌. మ‌రి ఈ ప‌రిస్థితుల నుంచి ఈపీఎస్ ఎలా గ‌ట్టెక్కుతారో చూడాలి