Begin typing your search above and press return to search.

రెండు నెలలే ఇస్తానంటున్న చిన్న‌మ్మ మేన‌ల్లుడు

By:  Tupaki Desk   |   6 Jun 2017 5:16 AM GMT
రెండు నెలలే ఇస్తానంటున్న చిన్న‌మ్మ మేన‌ల్లుడు
X
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకేలో లుకలుకలకు ఇప్పట్లో తెరపడేలా లేదు. ఇప్ప‌టికే మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి వ‌ర్గంగా చీలిపోయిన నాయ‌కుల్లో మ‌రో చీలిక వచ్చింది. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ అనుగ్ర‌హంతో ఏర్పాటైన ప‌ళ‌నిస్వామి బృందం చిన్న‌మ్మ శ‌శిక‌ళ కుటుంబంపై ఎర్ర‌జెండా ఎగురువేస్తోంది. ఈ క్ర‌మంలో ఆమె మేన‌ల్లుడు టీటీవీ దిన‌క‌ర‌న్‌ కు షాక్ ఇస్తూ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేశారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇవ్వచూపిన కేసులో అరెస్టై బెయిలుపై విడుదలైన టీటీవీ దినకరన్ బెంగళూరులో జైలులో ఉన్న శశికళతో నిన్న భేటీ అయ్యారు.

చిన్న‌మ్మ కుటుంబ‌స‌భ్యులు - ఆమె సానుభూతిప‌రుల స‌మావేశం నేప‌థ్యంలో అదే సమయంలో చెన్నైలో పళనిస్వామి కేబినెట్ లోని మంత్రి జయకుమార్ అధ్యక్షతన సీనియర్ మంత్రులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుమారు 17 మంది మంత్రులు హాజ‌రైన ఈ సమావేశం అనంతరం జయకుమార్ మాట్లాడుతూ టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయనకు పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ప్ర‌క‌టించారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పళనిస్వామి సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు.

శ‌శిక‌ళ‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ మంత్రి జయకుమార్ ప్రకటనను ఖండించారు. రాష్ట్ర మంత్రులు భయంతో తన గురించి మాట్లాడుతున్నారని, ఆ భయం ఎవరి వల్ల కలిగిందనే విషయం కాలక్రమంలో వెలుగులోకి వస్తుందని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. అన్నాడీఎంకే చీలికవర్గాల విలీనంపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారని, వాటి విలీనం కోసమే 45 రోజులపాటు తాను పార్టీకి దూరంగా ఉన్నానని దిన‌క‌ర‌న్ తెలిపారు. అయినా విలీన వ్యవహారంలో పురోగతిలేదని, అందువల్లే మళ్లీ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. శశికళ సూచనల మేరకు చీలికవర్గాల విలీనానికి మరో రెండు నెలల అవకాశమిస్తున్నానని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు చేశారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికుందని, జ‌య‌కుమార్ తన‌ను తాను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా భావిస్తున్నారా అని దిన‌క‌ర‌న్‌ ప్ర‌శ్నించారు. తాను పార్టీలోనే కొనసాగుతున్నానని, పార్టీలో తలెత్తే పరిణామాలను ఎలా సరిదిద్దుకోవాలో తమకు తెలుసన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/