Begin typing your search above and press return to search.

రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు..అధికార పార్టీ అసంతృప్త నేత‌

By:  Tupaki Desk   |   25 July 2017 7:59 AM GMT
రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు..అధికార పార్టీ అసంతృప్త నేత‌
X

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మ‌ళ్లీ మలుపులు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి - సీఎం జ‌య‌ల‌లిత మరణం తర్వాత మూడు గ్రూపులుగా అధికార పార్టీ నేతలు చీలిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం ఇందులో ఒక‌టి కాగా...సీఎం ప‌ళ‌నిస్వామి వ‌ర్గం మరొక‌టి. జైల్లో ఉన్న‌ప్ప‌టికీ త‌న‌కంటూ ఒక టీంను కొన‌సాగిస్తున్న‌ చిన్న‌మ్మ శ‌శిక‌ళ వ‌ర్గం ఒక‌టి. త‌న మేన‌ల్లుడు టీటీవీ దిన‌క‌రన్ ద్వారా త‌మిళ‌నాడులో రాజ‌కీయాల్లో చిన్న‌మ్మ చ‌క్రం తిప్పుతున్న సంగ‌తి తెలిసిందే. చిన్న‌మ్మ కూట‌మి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త యాత్ర‌కు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

పార్టీ గుర్తు రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపారనే కేసులో జైలుకు వెళ్లొచ్చిన టీటీవీ దినకరన్‌ తనకూ ఒక వర్గం ఉందని ప్రకటించారు. తనవైపు 30 మందికిపైగాఎమ్మెల్యేలు ఉన్నారని తేల్చిచెప్పారు. దీంతో అన్నాడీఎంకేలో మూడోవర్గం తెరపైకి వచ్చింది. అంతమంది ఎమ్మెల్యేలు పక్కకొస్తే... ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడుతుందనే ఆందోళనను మంత్రులు సైతం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శాసనసభ సమావేశాలను చాకచక్యంగా నిర్వహించి ఎడప్పాడి పళనిస్వామి సత్తా చాటారు. అటు పార్టీ పరంగా... ఇటు ప్రజల్లో కొంత పేరు గడించారు. పలు విభాగాల్లో సంక్షేమ పథకాల వెల్లడి - వివిధ రంగాలకు జీతాలు - పింఛన్ల పెంపుతో ఆకట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో బిల్లులను సైతం ఆమోదించుకుని ఔరా... అనిపించారు. అన్నాడీఎంకే అమ్మ వర్గం ఎమ్మెల్యే - టీటీవీ దినకరన్‌ మద్దతుదారుడు - పెరుందురై నియోజకవర్గ శాసనసభ్యుడు తొప్పు వెంకటాచలం అసెంబ్లీ కమిటీ పదవికి రాజీనామా చేశారు. అధికారపార్టీలోని సభ్యుడు ఇలా ప్రాధాన్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది.

జైలు నుంచి బెయిల్‌ పై వచ్చినప్పటి నుంచి దినకరన్‌ దూకుడు పెంచారు. చీలిక నేప‌థ్యంలో అన్నాడీఎంకే ఇరు వర్గాల విలీనం కోసం 60 రోజుల గడువు ఇచ్చిన టీటీవీ దినకరన్‌... అది జరగకుంటే తాను చేయాల్సింది చేస్తానని ఇదివరకే ప్రకటించారు. విలీనానికి పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్త యాత్రకు కూడా ప్రణాళిక రచించారు. అందులో భాగంగా ఆగస్టు 5నుంచి యాత్ర చేయాలని సన్నాహాలు చేపడుతున్నారని స‌మాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి ఒక హెచ్చరికలా తన వర్గం ఎమ్మెల్యేతో దినకరన్‌ ఇలా పదవికి రాజీనామా చేయించారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ రాజీనామాను ఒక అస్త్రంగానే దినకరన్‌ ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సజావుగా సాగాయని సంబరపడాలో... ముందు ముందు ఎదురవనున్న పరిణామాలను తలుచుకుని ఆందోళన చెందాలో తెలియని పరిస్థితి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిదని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.