Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ చాప్ట‌ర్ క్లోజ్ చేయించింది ఆయ‌నేన‌ట‌

By:  Tupaki Desk   |   19 April 2017 12:14 PM GMT
చిన్న‌మ్మ చాప్ట‌ర్ క్లోజ్ చేయించింది ఆయ‌నేన‌ట‌
X
త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయల‌లిత‌ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీని శాసిస్తుందనుకున్న చిన్నమ్మ‌ శశికళ ఊహించ‌ని రీతిలో పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌ కు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలులో ఉన్న శశికళ మరో 10 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. ఇప్ప‌టికే జైలు జీవితం చిన్న‌మ్మ పాలిట భారంగా మార‌గా...తాజాగా కుటుంబ స‌భ్యుడే కొంప ముంచినంత ప‌నిచేశాడ‌ని అంటున్నారు. ఆ ఇంటిమ‌నిషి ఎవ‌రో కాదు..అన్నాడీఎంకే డిప్యూటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ దిన‌క‌ర‌న్‌. శశికళ జైలుకు వెళ్లినప్పటి నుంచి దినకరన్ ఒంటెత్తు పోకడలను అవలంబిస్తుండటం, అమ్మ మ‌ర‌ణంతో వ‌చ్చిప‌డ్డ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో త‌న ప‌ని తాను చేసుకుపోకుండా అనవసరంగా మంత్రులపై ఒత్తిడి తెచ్చి మరీ దినకరన్ రచ్చ రచ్చ చేసి ఇరుక్కున్నాడని అన్నాడీఎంకే వర్గాలే చెబుతున్నాయి.

త‌న దూకుడు వైఖ‌రితో ముందుకు పోయిన దిన‌క‌ర‌న్ రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌ కు 50కోట్లు లంచం కేసులో ఇరుక్కుపోయారు. ఆయ‌న‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అతడితో పాటు బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్‌ పై కూడా కేసు నమోదు చేశారు. తాజాగా ఫెరా కేసులో మద్రాస్ కోర్టులో హాజరయ్యారు. ఇప్పటికే దినకరన్ ఆర్కే నగర్‌ లో శశికళ వర్గం అభ్యర్థిగా ఉండి డబ్బులు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారని.. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికను వాయిదా వేసింది. అయితే ఏకంగా ఎన్నికల కమిషన్‌ కే లంచం ఆశచూపిన దినకరన్ పై ఎలాంటి వేటు వేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలోంచి ఆయన్ను తీసేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు.

మ‌రోవైపు జాతీయ స్థాయిలో కూడా దినకరన్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్ప‌టికే జాతీయ పార్టీలు కూడా దినకరన్‌ పై రాజకీయ అనర్హత వేటు వేయాలని కూడా కోరుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలులో ఉన్న శశికళ మరో 10 ఏళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదు. ఆమెతో పాటు ఇప్పడు దినకరన్‌ కు కూడా రాజకీయంగా వేటు పడితే ఇక ఆ కుటుంబం రాజకీయంగా దూరమైనట్లేనన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఫెరా కేసులోనైనా.. ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులోనైనా దినకరన్‌కు శిక్ష పడక తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక తప్పు మీద తప్పు చేస్తూ దినకరన్ అడ్డంగా దొరికిపోయి.. తన రాజకీయ సమాధికి తానే గొయ్యిని తవ్వుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. అంతేకాదు చిన్నమ్మ రాజ‌కీయ జీవితాన్ని సైతం ముగింపు ప‌లికేలా దిన‌క‌ర‌న్ చేశాడ‌ని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/