Begin typing your search above and press return to search.

దిన‌క‌ర‌న్ మాస్ట‌ర్ ప్లాన్ అదిరిందిగా!

By:  Tupaki Desk   |   6 Sep 2017 8:10 AM GMT
దిన‌క‌ర‌న్ మాస్ట‌ర్ ప్లాన్ అదిరిందిగా!
X

త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప‌రిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో మొద‌లైన ఈ డైలీ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎడప్పాడి - ప‌న్నీర్ వ‌ర్గాల విలీనంతో దీనికి శుభంకార్డు ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావించారు. అయితే ఊహించని విధంగా అన్నాడీఎంకే బ‌హిష్క‌ృత నేత దిన‌క‌ర‌న్ తెర‌పైకి వ‌చ్చారు. ప‌ళ‌ని ప్ర‌భుత్వాన్ని కూలుస్తానని ప్ర‌క‌టించారు. త‌న వ‌ర్గం ఎమ్మెల్యేల‌తో బ‌ల ప్రద‌ర్శ‌న చేశారు. క్యాంపు రాజ‌కీయాన్నీ షురూ చేశారు. గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే బ‌ల‌ప‌రీక్ష‌కు అనుమ‌తించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో రాజ‌కీయం ఇంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంటే మ‌రోవైపు దిన‌క‌ర‌న్ కుటుంబ స‌భ్యులు క‌ర్ణాట‌క వెళ్లారు. వారంతా క‌ర్ణాట‌క వెళ్లింది స‌రదాగా ఏ మాత్రం కాదు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను క‌ల‌వ‌డానికి. దినకరన్‌ సతీమణి అనురాధతో పాటు పలువురు బంధువులు మంగళవారం ములాఖత్‌ అయ్యారు. ఈ సంద‌ర్భంగా శశికళతో కొన్ని పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నార‌ని సమాచారం. పార్టీ సర్వసభ్య సమావేశంలో సీఎం పళనిస్వామి బృందం తనకు, దినకరన్‌ కు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ సంతకాలు తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పరప్పన అగ్రహార జైలులో శశికళ లగ్జరీ జీవితానికి సంబంధించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన త‌రువాత‌.. ఆమెతో భేటీ అయ్యే వారి వివరాలను విచారణ బృందం సేకరిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం వెలుగు చూసింది.

పళనిస్వామి - పన్నీర్‌ సెల్వంను పదవుల నుంచి దించేందుకు దినకరన్ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఇంటా బ‌య‌టా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఒక్కో అడుగు ముందుకేస్తూ త‌న ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే దిన‌క‌ర‌న్ కుటుంబ‌స‌భ్యులు చిన్నమ్మ‌ను క‌లిసిన‌ట్లు భావిస్తున్నారు. మ‌రోవైపు.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పళనిస్వామి మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ భేటికి 111 మంది అన్నాడీఎంకే సభ్యులు హాజరయ్యారని రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి డి జయకుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలు సీఎంకు పూర్తి మద్దతు ప్రకటించారని, ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉంచుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారని వెల్లడించారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో తాజా పరిణామం సీఎంకు ఊరటనిచ్చింది. శాసనసభలో అధికార పార్టీకి 134 మంది సభ్యులున్నారు. అయితే మారుతున్న రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిరుగుతాయో వేచిచూడాలి.