Begin typing your search above and press return to search.

న‌టి లేఖ రాసిన ప‌క్క‌రోజే సీఎంకు హీరో త‌ల్లి లేఖ‌

By:  Tupaki Desk   |   16 Aug 2017 4:50 AM GMT
న‌టి లేఖ రాసిన ప‌క్క‌రోజే సీఎంకు హీరో త‌ల్లి లేఖ‌
X
దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన న‌టి లైంగిక వేధింపుల ఉదంతం తెలిసిందే. బ‌హుభాషా చిత్రాల్లో న‌టించిన ఒక న‌టి ఆ మ‌ధ్య కేర‌ళ‌లో త‌న కారులో వెళుతున్న వేళ‌.. ఆమె కారును అడ్డ‌గించి కారులో లైంగిక దౌర్జ‌న్యానికి పాల్ప‌డ‌టం.. ఈ ఉదంతంలో సంబంధం ఉందంటూ మ‌ల‌యాళ సూపర్ స్టార్ దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ఇష్యూలో త‌న‌ను అన‌వ‌స‌రంగా ఇరికించార‌ని హీరో దిలీప్ చెబుతున్నారు. గ‌డిచిన కొద్ది రోజులుగా జైల్లో ఉన్న ఆయ‌న ఇప్ప‌టికే బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌టం.. కోర్టు తిర‌స్క‌రించ‌టం జ‌రిగాయి. ఇదిలా ఉండ‌గా.. తాజాగా మ‌రోసారి ఆయ‌న త‌నకు బెయిల్ ఇప్పించాల‌ని కోరుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల బాధిత న‌టి కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి లేఖ రాశారు.రాష్ట్ర మంత్రి పీసీ జార్జ్ పై ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మ‌ధ్య‌న మంత్రి చేసిన వ్యాఖ్య‌లు కేసు విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌శ్నించేలా ఉంద‌ని.. కేసును త‌ప్పుదోవ ప‌ట్ట‌కుండా చూడాల‌ని కోరారు. న‌టి లేఖ రాసిన ప‌క్క రోజే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ త‌ల్లి సీఎంకు లేఖ రాయ‌టం గ‌మ‌నార్హం.

త‌న కుమారుడు అమాయ‌కుడ‌ని.. అత‌డికి న‌టి కేసుతో ఎలాంటి సంబంధం లేద‌ని హీరో దిలీప్ త‌ల్లి స‌రోజం పిళ్లై పేర్కొన్నారు. తాజాగా ఆమె కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కు లేఖ రాశారు. అలువా స‌బ్ జైల్లో ఉన్న త‌న కుమారుడికి బెయిల్ మంజూరు చేయాల‌ని ఆమె కోరారు. త‌న కొడుకు నేరాల‌కు పాల్ప‌డే వ్య‌క్తి కాద‌న్న ఆమె.. కేసును మ‌రోసారి విచారించి న్యాయం చేయాల‌ని కోరారు. హీరో త‌ల్లి రాసిన లేఖ‌ను అందుకున‌న ముఖ్య‌మంత్రి దాన్ని.. కేర‌ళ పోలీస్ బాస్ కు పంపిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. పోటాపోటీగా రాస్తున్న లేఖ‌లు ఏ ప‌రిణామాల‌కు దారి తీస్తాయో చూడాలి.