Begin typing your search above and press return to search.

పవన్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు భరించేది ఈయనేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 4:30 PM GMT
పవన్ స్పెషల్ ఫ్లైట్ ఖర్చు భరించేది ఈయనేనా?
X
అంతన్నాడు.. ఇంతన్నాడు.. చివరకు సినిమాలు చేసేస్తున్నారు.. సినిమాలు చేయనే చేయను అని స్పష్టం చేసి రాజకీయాల బాట పట్టిన పెద్దమనిషి ఇప్పుడు మనసు మార్చుకొని తిరిగి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఆర్థిక అవసరాలో.. లేక పార్టీకి ఫండ్ కోసమే.. వ్యక్తిగత ఖర్చులో కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల బాటపట్టడం ఆయనకున్న లక్షలాది మంది ఫ్యాన్స్ కు ఊరటనిచ్చింది.

అయితే సినిమాలు చేయను ఇక తన జీవితం రాజకీయాలకే అంకితమన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చి.. పవన్ తో సినిమా తీయాలన్న ఏకైక కోరికను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజ్ నెరవేర్చుకుంటున్నారు. ఇందుకోసం పవన్ కు కళ్లు చెదిరేలా 50 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్టు టాలీవుడ్ లో చెవులు కొరుక్కుంటున్నారు. ఇంత భారీ మొత్తం ఆఫర్ చూసే పవన్ సినిమా ఒప్పుకొని చేస్తున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మొత్తానికి పవన్ ను మాట తప్పేలా చేయడంలో దిల్ రాజు విజయం సాధించారని చెప్పవచ్చు.

పోనీ లే.. ఎలా అయితే ఏంటి మా ‘పవనాలు’ సినిమా చేస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ సంతోషంలో ఉండగానే లేనిపోని ఉప్రదవం వచ్చిపడింది. ఈ ఏపీ సీఎం జగన్ ఊరికే ఉండడు కదా.. పవన్ ను ప్రశాంతంగా షూటింగ్ జరుపుకోనివ్వకుండా అసెంబ్లీలో ‘3 రాజధానుల’ బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో ఉదయం ఉద్యమాలు, సాయంత్రం షూటింగ్ లంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్- విజయవాడ మధ్య ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతున్నారు. సాధారణంగా కారులో వచ్చే పవన్ ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకున్నారు. దాని కథ వేరే ఉందట..

పవన్ కళ్యాణ్ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి ఏపీకి 3 రాజధానులపై పోరాటానికి రెడీ అయ్యారట.. కానీ అంతా సిద్ధం చేశాక షూటింగ్ వాయిదా వేయడం కరెక్ట్ కాదని భావించిన నిర్మాత దిల్ రాజు ఏకంగా పవన్ రాజకీయం, సినిమా షూటింగ్ రెండూ జరిగేలా పవన్ కోసం ఏకంగా ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్టు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుంటున్న పవన్ అక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకొని సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇక్కడ షూటింగ్ లో పాల్గొని సినిమా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా సినిమాలు, రాజకీయం బ్యాలెన్స్ చేస్తూ కష్టపడడాన్ని ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటుండడగా.. పవన్ ప్రయాణిస్తున్న విమాన ఖర్చు భరించ లేక నిర్మాత దిల్ రాజు పాపం ఎంత కష్టపడుతున్నారో అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి..

అయితే చాలా గ్యాప్ ఇచ్చి పవన్ సినిమాలు చేస్తుండడం.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం.. ఖర్చు ఖచ్చితంగా తిరిగి వస్తుందన్న నమ్మకంతో దిల్ రాజ్ తాజాగా ‘పింక్’ రిమేక్ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడడం లేదని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..