Begin typing your search above and press return to search.

ప్రియాంక ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చిన డిగ్గీరాజా

By:  Tupaki Desk   |   18 May 2016 2:48 PM GMT
ప్రియాంక ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చిన డిగ్గీరాజా
X
ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నాయ‌కులు పుడుతుంటారు. కానీ.. కొన్నిసార్లు మాత్రం నాయ‌కులు త‌యార‌వుతుంటారు.దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి అత్య‌ధికాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఓ అల‌వాటు ఉంది. ఆ పార్టీ ఏం ఉన్నా లేకున్నా బ‌తికేయ‌గ‌ల‌దు కానీ ప‌వ‌ర్ లేకుండా అస్స‌లు త‌ట్టుకోలేదు. నీళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డిన చేప మాదిరి గిల‌గిలాడిపోతుంటుంది. ప‌వ‌ర్ చేతిలో ఉంటే చాలు.. ఎలాంటి ప‌రిస్థితులున్నా ఫ‌ర్లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం కాంగ్రెస్ కు అల‌వాటే.

గాంధీ కుటుంబం మీద ప‌డి బ‌తికేసే ఆ పార్టీ.. అవ‌స‌రానికి అనుగుణంగా త‌మ‌కు అధికారాన్ని తీసుకొచ్చే నేత‌ల కోసం వెతుకుతుంటారు. పీవీ త‌ర్వాత చేజారిన ప‌వ‌ర్ ను సోనియ‌మ్మ ఎంట్రీతో సానుభూతితో ప‌వ‌ర్ లోకి వ‌చ్చేసిన త‌ర్వాత‌.. దాన్ని కొన‌సాగించేందుకు రాహుల్ పార్టీకి అండ‌గా నిలుస్తార‌ని చాలానే అనుకున్నారు. కానీ.. యువ‌రాజులో అంత సీన్ లేద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌య్యాక‌.. ప్ర‌త్యామ్నాయం మీద దృష్టి సారించ‌టం మొద‌లు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌కీయాల‌కు దూరంగా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయే ఇందిర‌మ్మ మ‌న‌మ‌రాలు ప్రియాంక‌ను రాజ‌కీయ తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆతృత‌లో కాంగ్రెస్ నేత‌లు ఉన్నారు. రూపంలో నాన‌మ్మ పోలిక‌లు ఉన్న ప్రియాంక‌మ్మ కానీ సీన్లోకి వ‌చ్చేస్తే ఓట్లు జ‌ల‌జ‌లా రాలుతాయ‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల ఆలోచ‌న‌. అందుకే.. ఈ మ‌ధ్య‌న అవ‌స‌రం ఉన్నా లేకున్నా ప్రియాంక‌మ్మ జ‌పం జోరు పెరిగింది. మ‌రికొద్ది నెల‌ల్లో రానున్న యూపీ ఎన్నిక‌ల నాటికి ప్రియాంక‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేస్తే ఆమె చ‌రిష్మాతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చేయాల‌న్న‌ది కాంగ్రెస్ ఆలోచ‌న‌.

అందుకే.. త‌ర‌చూ ప్రియాంక‌గాంధీని వార్త‌ల్లోకి తెచ్చేస్తూ ఆమె ఇమేజ్ బిల్డ్ చేసే ప‌నిని కాంగ్రెస్ ఈ మ‌ధ్య‌న జోరు పెంచింది. జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గ‌డిచిన రెండు నెల‌లుగా ప్రియాంక‌మ్మ‌కు సంబంధించి.. ఆమె కాంగ్రెస్ లో ఎంట్రీ గురించిన వార్త‌లు త‌ర‌చూ రావ‌టం క‌నిపిస్తుంది. ఇదంతా ఆమెకు స‌రికొత్త ఇమేజ్ క‌ట్ట‌బెట్ట‌ట‌మేకాదు.. ఆమె తెలివితేట‌లు.. సామ‌ర్థ్యం మీద నేత‌లు స‌ర్టిఫికేట్లు ఇస్తూ.. ఆమెను ఆకాశానికి ఎత్తేయ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన దిగ్విజ‌య్ సింగ్ ఒక మీడియా ఏజెన్సీతో మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థ‌ల్లో.. మీడియా ఏజెన్సీల్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌శ్న‌ల్ని అడిగేలా చూసి.. తాము చెప్పాల‌నుకున్న స‌మాధానాలు చెప్ప‌టం మామూలే. ఇదే తీరును ప్రియాంక‌మ్మ విష‌యంలోనూ అనుస‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నాయ‌న‌మ్మ రూపంలోనే కాదు. శ‌క్తి సామ‌ర్థ్యాల విష‌యంలోనూ త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు డిగ్గీరాజా. ప్రియాంక‌మ్మ‌ రాజ‌కీయాల్లోకి రావాల‌ని కాంగ్రెస్ కోరుకుంటున్న‌ట్లు డిగ్గీ వెల్ల‌డించారు. రాహుల్ కు కాంగ్రెస్ ప‌గ్గాలు ఎప్పుడు అప్ప‌గిస్తార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పని ఆయ‌న‌.. అధినేత్రి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకుంటార‌ని చెప్ప‌టం విశేషం. ఇంత‌కీ.. అబ్బాయికి ఇవ్వాల్సిన ప‌గ్గాల్సి.. అమ్మాయికి ఇస్తూ సోనియ‌మ్మ నిర్ణ‌యం తీసుకోరు క‌దా..?