Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ కు ఆఖ‌రికి వైఎస్ దిక్కు అయిన‌ట్లున్నాడు

By:  Tupaki Desk   |   10 April 2017 6:59 AM GMT
కాంగ్రెస్‌ కు ఆఖ‌రికి వైఎస్ దిక్కు అయిన‌ట్లున్నాడు
X
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మాస్ ఫాలోయింగ్‌ ను త‌న ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోందా? రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ త‌ను తిరిగి పుంజుకునేందుకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రాన్ని జ‌పించాల‌ని చూస్తోందా? ఈ క్ర‌మంలో వైఎస్ త‌న‌యుడు - వైసీపీ అధినేత జగ‌న్‌ కు సైతం ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప‌లుకుతోందా అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 14 ఏళ్లు అయిన సందర్భంగా ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌ లో ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరారెడ్డి కేక్‌ను కట్ చేశారు. ఈ సంద‌ర్భంగా దిగ్విజ‌య్ సింగ్ మాట్లాడుతూ....ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో సంక్షేమ పాల‌న అందించిన గొప్ప సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అని దిగ్విజ‌య్‌ సింగ్ అన్నారు. కాంగ్రెస్- వైఎస్ ఒక్కటేనని వేరుకాదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు - పావలా వడ్డీ - ఉచిత వైద్యం వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధిష్ఠానం చెబితేనే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని దిగ్విజ‌య్ అన్నారు.

అనంతరం దిగ్విజ‌య్‌ సింగ్‌ విలేక‌రులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆర్థిక నేరస్తుడని పదేపదే ఆరోపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప‌ని కూడా ఆర్థిక నేర‌మేన‌ని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కావలసిన దానికన్నా అధిక భూములు సేకరించి భూసేకరణ పేరుతో చేస్తున్నది కూడా ఆర్థిక నేరమని స్ప‌ష్టం చేశారు. క్యాపిటల్ సిటీ, ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు లాక్కుని అమ్ముకుంటున్నారన్నారు. ఏపీలో భారీగా అవినీతి జరుగుతోందని దిగ్విజ‌య్ ఆరోపించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - వెంకయ్య నాయుడు - చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసగించారన్నారు. కమీషన్లు కోసమే బాబు ప్యాకేజీ జపం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు తన కొడుక్కి దొడ్డిదారిన ఉద్యోగం ఇచ్చాడని దిగ్విజ‌య్ సింగ్ ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పట్టించుకోకుండా వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. ఇది సరికాదని ఖండించారు. 2019లో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తామని, ఎవరైనా మద్దతు ఇస్తామంటే కాదనబోమని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన కారణంగా హైదరాబాద్‌ ను కోల్పోతున్న సందర్భంగా ఏపీకి 5 సంవత్సరాల ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే, కాదు 10 సంవత్సరాలు కావాలని జైట్లీ అడిగారని గుర్తుచేశారు. వెంకన్న సాక్షిగా 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని, చంద్రబాబు కావాలన్నారని తెలిపారు. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం వల్ల హోదా రద్దుచేయాల్సి వచ్చిందంటున్నారని పేర్కొన్నారు. ‘హోదా వల్ల చంద్రబాబు ఏమి ప్రయోజనం లేదని అంటున్నారు. ప్రతి మనిషికి మెదడు ఉంటుంది. బుద్ధి, జ్ఞానం ఉండాలంటే మెదడు ఉండాలి’ అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ చంద్రబాబు ఆస్తులు పెంచుకోవడానికి తప్ప దేనికీ ఉపయోగపడదన్నారు. ఈ నెల 12న ప్రైవేట్ మెంబర్ బిల్లుగా తాను పెట్టిన హోదా బిల్లు రాజ్యసభ ముందు చర్చకు వస్తుందన్నారు. ఏఐసీపీ నాయకులు కొప్పుల రాజు మాట్లాడుతూ 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు నిబంధనలకు విరుద్ధమన్నారు. కాంగ్రెస్ పార్టీ చట్ట వ్యతిరేక సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు. ఈ విషయంపై ఏఐసీసీ ఆధ్వర్యంలో రాష్టప‌తి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా రాజధాని అమరావతి రైతులు దిగ్విజయ్ సింగ్‌ ను కలిసి వినతిపత్రం అందించారు. తమకు అండగా నిలవాలని, 2013 భూసేకరణ చట్ట సవరణలను వ్యతిరేకించాలని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/