Begin typing your search above and press return to search.

ఒక్కో ఎమ్మెల్యేకు ప‌ది కోట్లు ఇస్తున్న బాబు!

By:  Tupaki Desk   |   2 Nov 2016 3:53 PM GMT
ఒక్కో ఎమ్మెల్యేకు ప‌ది కోట్లు ఇస్తున్న బాబు!
X
ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న డిగ్గీ విజ‌య‌వాడ‌లో పార్టీ స‌మావేశం అనంత‌రం తిరుపతి విలేకరుల సమావేశం మాట్లాడుతూ పోలవరం నిర్మాణ వ్యయం పెంచడం వెనక చంద్రబాబుకు ఆర్థిక ప్రయోజనాలు దాగున్నాయని ఆరోపించారు. పోలవరం అంచనాను 16 నుంచి 44 వేల కోట్లకు పెంచడం వెనుక మతలబు ఇదేన‌ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.10 కోట్ల చొప్పున ఇస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటిస్తున్నారని, ఇలాంటి ప్ర‌క‌ట‌న వెనుక పోల‌వ‌రం స‌హా ఇత‌ర ప్రాజెక్టుల్లో దోచుకున్న అవినీతి సొమ్మే కార‌ణ‌మ‌ని దిగ్విజ‌య్ సింగ్ ఆరోపించారు. ఒక‌వేళ ఇది నిజం కాక‌పోతే అస‌లు విష‌యం సీఎం చంద్రబాబు చెప్పాలని దిగ్విజ‌య్ డిమాండ్ చేశారు.

అమరావతి నిర్మాణం పనులు విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం - దేశీయ కంపెనీలు డ్రైనేజీ లు నిర్మించడానికే పనికొస్తాయన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యలు దేశ పరువు తీసేలా ఉన్నాయని దిగ్విజ‌య్ సింగ్ మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న‌ పరిస్థితి గతంలో ఎక్కడా చూడలేదని దిగ్విజ‌య్ అన్నారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వంపై సైతం దిగ్విజ‌య్ మండిప‌డ్డారు. ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు విఫలమైందని ఆ ప్రభావం ధరల పై పడిందన్నారు. తన హామీలు నిలబెట్టుకోడంలో మోడీ చతికిల పడ్డారని దిగ్విజ‌య్ విమ‌ర్శించారు. త్రిపుల్ తలాక్ - ఉమ్మడి పౌర స్మృతి విషయంలో సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారు తప్ప, మైనారిటీల అభివృద్ధిని ఆకాంక్షిండం లేదని దుయ్య‌బ‌ట్టారు. పఠాన్ కోట - ఉరి దాడులను పసిగట్టడంలో మన నిఘా సంస్థలు విఫలమయ్యాయని దానికి బాధ్యులు ఎవరని దిగ్విజ‌య్ సింగ్ ప్రశ్నించారు. భోపాల్ సిమి ఉగ్రవాదుల ఏన్ కౌంటర్ పై అనేక అనుమానాలు ఉన్నాయ‌ని ఎన్ కౌంటర్ పై ఎన్ ఐఎ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/