Begin typing your search above and press return to search.

వైఎస్ ను గుర్తు చేసుకున్న డిగ్గీరాజా

By:  Tupaki Desk   |   1 Nov 2016 9:27 AM GMT
వైఎస్ ను గుర్తు చేసుకున్న డిగ్గీరాజా
X
చంద్రబాబు డబ్బుతో ఏదైనా కొనేయగలం అనుకునే మనిషని... 2004 ఎన్నికల ముందు కూడా ఆయన ప్రతి అభ్యర్థికీ కోట్ల రూపాయాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి గెలిచే ప్రయత్నం చేశారని.. కానీ... వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వ పటిమ కారణంగా చంద్రబాబు కుయుక్తులు పారలేదని కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని ఆయన మండిపడ్డారు. మోడీపైనా ఆయన మండిపడుతూ మహాత్మాగాంధీ కళ్లజోడును కూడా మోడీ ప్రచారానికి వాడుకుంటున్నారన్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిర్మాణ కంపెనీలను కాదని చంద్రబాబు సింగపూర్‌ వైపు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. మన వాళ్ల వద్ద కూడా మంచి టెక్నాలజీ అందుబాటులో ఉందని చెప్పారు. నాగార్జున సాగర్ లాంటి డ్యాంలు కట్టిన మన భారతీయ కాంట్రాక్టర్లు.. కేవలం డ్రెయిన్లు మాత్రమే కట్టగలరని చంద్రబాబు అంటున్నారని, ఆయన ఆలోచన తీరు అలా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలోనూ ఆయన రాజీపడడం వెనుక కారణాలున్నాయన్నారు.

చంద్రబాబు డబ్బు మనిషని.. డబ్బుతో అందరినీ కొనేయాలని చూస్తారని చెబుతూ గతంలో ఎన్నికల్లో జరిగిన వ్యవహారాలను గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో డబ్బు గురించి ఎమ్మెల్యేలు ఆందోళన చెందవద్దని, ప్రతి అభ్యర్థికి రూ. 10 కోట్ల వంతున ఇస్తామని చంద్రబాబు బహిరంగంగానే చెబుతున్నారని ఆయన ఆరోపించారు. 2004 ఎన్నికలకు ముందు కూడా ఆయన అలాగే చేశారని, కానీ కాంగ్రెస్ హయాంలో వైఎస్ తన నాయకత్వ పటిమ - ప్రజాదరణతో చంద్రబాబు ఎత్తులన్నీ చిత్తు చేశారని కొనియాడారు.

మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఆయనను కేవలం ఒక ఆర్ ఎస్ ఎస్ నేతగా చూపే ప్రయత్నం చేస్తోందని దిగ్విజయ్ విమర్శించారు. 31 అక్టోబర్‌ ను ఇందిర వర్ధంతి సందర్భంగా జాతీయ సమగ్రతా దినంగా ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించిందని - ఇప్పుడు ఈ అంశంపై వాళ్లు వివాదం చేస్తున్నారని అన్నారు. మహాత్మాగాంధీ కళ్లజోడును కూడా స్వచ్ఛభారత్‌ ప్రచారం కోసం వాడుకుంటున్నారని.. ఆయన శాంతి ప్రవక్త అన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారని అడిగారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/