Begin typing your search above and press return to search.

ఇకపై పంచాయతీ పనులకు యూపీఐ పేమెంట్లు!

By:  Tupaki Desk   |   1 July 2023 7:00 AM GMT
ఇకపై పంచాయతీ పనులకు యూపీఐ పేమెంట్లు!
X
ఇకపై దేశంలోని అన్ని పంచాయతీలు తమ పరిధిలో జరిగే అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు మొదలైన ఆర్థిక లావాదేవీల వ్యవహారలకు డిజిటల్‌ పేమెంట్‌ విధానాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు రాబోయే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 రోజున అన్ని పంచాయతీలను యూపీఐ వినియోగ గ్రామాలుగా ప్రకటిస్తామని వెల్లడించింది.

అవును... ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలోని అన్ని పంచాయతీలు అన్ని అభివృద్ధి పనులకు, ఆదాయ సేకరణకు తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తాయని.. ఫలితంగా యూపీఐ గ్రామాలుగా ప్రకటించబడతాయని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

అయితే దాదాపు 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యుపిఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు.

అనంతరం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (పి.ఎం.ఎఫ్‌.ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయని చెప్పిన ఆయన... ఇకపై పంచాయతీలకు డిజిటల్‌ గా చెల్లింపులు జరగనున్నాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇకపై చెక్కులు, నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోనున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో... పంచాయతీలు నెటి నుంచి (జూన్ 30) సర్వీసు ప్రొవైడర్లతో సమావేశమవ్వాలని.. జులై 15 నాటికి గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం, భారత్‌ పే, భీమ్‌, మొబిక్విక్‌, వాట్సప్‌ లలో వాటికి అనువైన వాటిని ఎంపిక చేసుకుని.. జూలై 30వ తేదీలోగా ఒకదానిని ఖరారు చేయాలని ఆయన సూచించారు.

అదేవిధంగా... అధికారులకు జిల్లా, బ్లాక్ స్థాయిల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారని తెలిపిన పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్... డిజిటల్ లావాదేవీలను ప్రారంభించడం వల్ల అవినీతిని అరికట్టవచ్చునని తెలిపారు.