Begin typing your search above and press return to search.

డిజిటల్ పేమెంట్స్ లో ఇండియా ఎక్కడ ఉందంటే ..!

By:  Tupaki Desk   |   20 Nov 2019 11:18 AM GMT
డిజిటల్ పేమెంట్స్ లో ఇండియా ఎక్కడ ఉందంటే ..!
X
చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మానవ జీవితాలలో పెను మార్పులు వచ్చాయి. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చిన తర్వాత డబ్బుల కోసం బ్యాంకుల వైపు పరుగులు తీసే రోజులు తగ్గిపోయాయి. కూర్చున్న చోటు నుండే బ్యాంకు పనులని పరిష్కరించుకుంటున్నారు. చేతిలో ఫోన్‌ ఉంటే చాలు ఎన్నో రకాల పనులను సులువుగా చేసేసుకుంటున్నారు. కేవలం ఫోన్‌ మాట్లాడటం - వీడియోలు చూడటానికే కాకుండా.. డిజిటల్ పేమెంట్స్ కి కూడా ఉపయోగిస్తున్నారు. చేతిలోడబ్బు లేకున్నా .. కార్డులు - స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు మన పనులు అయిపోతాయి.

గత కొన్ని రోజుల క్రితం మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెద్ద నోట్లని రద్దు చేసి డిజిటల్ వైపు మళ్లించింది. అలాగే జియో రాకతో ఈ డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. భారత్‌ లో డిజిటల్‌ లావాదేవీలు ఏ మేరకు జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ...

ఇండోనేసియా - వియత్నాం - థాయ్‌ లాండ్‌ - సింగపూర్‌ - మలేసియా - ఫిలిప్పీన్స్‌ - కంబోడియా - లావోస్‌ వంటి ప్రాంతాలను ఆగ్నేయ ఆసియా దేశాలుగా పరిగణిస్తారు. వీటిల్లో ఎక్కువ దేశాలు పర్యాటకం మీద ఆధారపడిన దేశాలు కావడం విశేషం. వివిధ దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళాలాడుతుంటాయి. అయితే కరెన్సీ సమస్య తలెత్తకుండా కార్డులు - ఆన్‌ లైన్‌ చెల్లింపులు - ఖాతా నుంచి ఖాతాకు మళ్లింపు - ఈ-వాలెట్స్‌ వంటి డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిజిటల్‌ లావాదేవీలు ఈ సంవత్సరం ఆఖరి నాటికి 600 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు (రూ.42లక్షల కోట్లు) చేరుకోనుంది. 2025 నాటికి ఈ సంఖ్య ఒక ట్రిలియన్‌ డాలర్లు (రూ. 70లక్షల కోట్లు) మార్కును తాకే అవకాశముందని ఒక సర్వేలో వెల్లడైంది.

ఇక ఇండియా లో చూస్తే ..గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల 80 శాతం మందికి డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఖాతా ఉన్నట్లు తెలుస్తోంది. జర్మనీకి చెందిన ఆన్‌ లైన్‌ గణాంకాల పోర్టల్‌ స్టాటిస్టా నివేదిక ప్రకారం 2019లో భారత్‌ లో 64.8 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.6లక్షల కోట్లు)గా తెలిపింది. సరాసరి ఇరవై శాతం వృద్ధితో 2023 నాటికి డిజిటల్‌ చెల్లింపులు 134.6 బిలియన్‌ డాలర్లు పెరిగే అవకాశం ఉందని, అదే విధంగా 2025 నాటికి 194.1 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.13.7లక్షల కోట్లు) స్థాయికి చేరనుందని సర్వే వెల్లడించింది. ఆగ్నేయ ఆసియా దేశాల వృద్ధి రేటు 20 శాతం లెక్కన భారత్‌ లోనూ అంచనా వేసినట్లు నివేదిక తెలిపింది. అయితే జనాభా ప్రకారం ఆగ్నేయాసియా దేశాల జనాభా 65 కోట్లు కాగా.. భారత్‌ జనాభా 133 కోట్లు.