Begin typing your search above and press return to search.

ఎవ‌రీ రూప‌..ఆమె నివేదికలో అస‌లేముంది?

By:  Tupaki Desk   |   14 July 2017 5:06 AM GMT
ఎవ‌రీ రూప‌..ఆమె నివేదికలో అస‌లేముంది?
X
అధికారాన్ని అర‌చేతిలో పెట్టుకొని ఉండే చిన్న‌మ్మ లాంటి ప‌వ‌ర్ స్టేష‌న్‌కు చుక్క‌లు చూపించ‌టం మాట‌లు కాదు. అందుకు ఎంతో ద‌మ్ము.. అంత‌కు మించిన ఆత్మ‌విశ్వాసం అవ‌స‌రం. అవ‌న్నీ త‌న‌లో ట‌న్నులు.. ట‌న్నులుగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని త‌న చేత‌ల‌తో చూపించారు ఐపీఎస్ అధికారిణి డి.రూప‌. అక్ర‌మాస్తుల కేసులో క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో ఉంటున్న అన్నాడీఎంకే అధినేత్రి శ‌శిక‌ళ రాణిభోగాలు అనుభ‌విస్తున్నార‌ని.. రూ.2 కోట్ల లంచంతో ఫైవ్ స్టార్ వ‌స‌తుల్ని క‌ల్పించుకున్నార‌న్న విష‌యాన్ని త‌న నివేదిక‌తో బ‌య‌ట‌పెట్టి పెను సంచ‌ల‌నానికి తెర తీశారు.

జైళ్ల శాఖ‌లో డీఐజీగా ప‌ని చేస్తున్న ఈ రూప ఎవ‌ర‌న్న ఆస‌క్తి ఇప్పుడు ఎక్కువైంది. ఆమె బ్యాక్ గ్రౌండ్‌ను చెక్ చేస్తే.. క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరె ప్రాంతానికి చెందిన డి.రూప 2000 సివిల్స్ లో 43 ర్యాంకును సాధించి ఐపీఎస్‌ కు ఎంపిక‌య్యారు. హైద‌రాబాద్ లోని పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతూ ప‌లు అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. షార్ప్ షూట‌ర్ గా పేరున్న రూప‌.. 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడ‌ల్‌ను సాధించారు.

ఎస్పీగా ప‌ని చేసే స‌మ‌యంలో కోర్టు ఆదేశాల‌తో క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్న నాటి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఉమాభార‌తిని అరెస్ట్ చేసిన వెలుగులోకి వ‌చ్చిన రూప పేరు అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా మారుమోగింది. బెంగ‌ళూరు డీసీపీగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో వీఐపీలు.. రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌ల్లో ప‌ని చేస్తున్న పోలీసుల‌ను వెన‌క్కి పిలిచి వార్త‌ల్లోకి ఎక్కారు. ఏఆర్ డీసీపీగా ఉన్న‌ప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి యాడ్యూర‌ప్ప కాన్వాయ్ లోని అన‌ధికార పోలీస్ వాహ‌నాల‌ను ఉప‌సంహ‌రించ‌టం కూడా అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి తెర తీసింది. తాజాగా చిన్న‌మ్మ శ‌శిక‌ళ రాణి భోగాల గురించి నివేదిక ఇవ్వ‌టం ద్వారా దేశ వ్యాప్తంగా ఆమె హాట్ టాపిక్ గా మారారు.

ఇక‌.. చిన్న‌మ్మ మీదా.. ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైలు పైన‌ ఆమె ఇచ్చిన నివేదిక‌లో ఉన్న కీల‌క అంశాల్ని చూస్తే..

= జైల్లో ప్ర‌త్యేక వంట‌గ‌దిని ఏర్పాటు చేశారు
.
= స్మార్ట్ ఫోన్లు.. మాద‌క ద్ర‌వ్యాలు య‌థేచ్ఛ‌గా జైల్లోకి స‌ర‌ఫ‌రా అవుతున్నాయి.

= అన్ని త‌మిళ చాన‌ల్స్ చూసేలా ప్ర‌త్యేక కేబుల్ క‌నెక్ష‌న్‌ ను ఏర్పాటు చేశారు.

= ఫైవ్ స్టార్ హోట‌ల్లో ల‌భించే అన్ని సౌక‌ర్యాలు జైల్లో ల‌భిస్తున్నాయి.

= శ‌శిక‌ళ‌తో పాటు న‌కిలీ స్టాంప్ పేప‌ర్ల కుంభ‌కోణంలో శిక్ష అనుభ‌విస్తున్న కరీంలాలా తెల్గీ కూడా లంచాలు ఇచ్చి రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నారు.