Begin typing your search above and press return to search.

కెప్టెన్ రావట్లే.. ఆస్ట్రేలియా కష్టాలు రెట్టింపు.. సారథ్యం ఎవరికంటే?

By:  Tupaki Desk   |   24 Feb 2023 2:41 PM GMT
కెప్టెన్ రావట్లే.. ఆస్ట్రేలియా కష్టాలు రెట్టింపు.. సారథ్యం ఎవరికంటే?
X
టీమిండియా స్పిన్నర్ల ధాటికి టెస్టును రెండు రోజులు కూడా ఆడలేకపోతోంది. దీనికితోడు బౌలర్లు, బ్యాట్స్ మన్, ఆల్ రౌండర్లు గాయాలపాన చేస్తున్నారు. ఒక స్పిన్నర్ సేవలు అవసరం లేదని వెనక్కు పంపించేశారు. ఫిట్‌నెస్‌ సమస్యల తో పేసర్ హేజిల్‌వుడ్‌ ఈ సిరీస్‌కే దూరమయ్యాడు.

ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా.. మిగతా రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఇక వ్యక్తిగత పనులపై స్వదేశానికి వెళ్లిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మూడో టెస్టు సమయానికి తిరిగి రావడం లేదని తేలింది. దీంతో వైస్‌ కెప్టెన్‌.. గతంలో కెప్టెన్ గానూ వ్యవహరించిన స్మిత్‌ మూడో టెస్టుకు సారథ్యం చేపట్టే అవకాశం ఉంది.

అమ్మకు అనారోగ్యంతో..

కమ్మిన్స్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ పేసర్. మూడు ఫార్మాట్లూ ఆడుతున్నాడు. భారత్ తో జరిగిన రెండు టెస్టుల్లో మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అయితే, కెప్టెన్ గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మొదటి టెస్టులో ఇద్దరే స్పిన్నర్లతో బరిలో దిగాలని నిర్ణయించడం పెద్ద పొరపాటని తేలింది. రెండో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, స్పిన్ పిచ్ లపై పేస్ బౌలర్ గా కమ్మిన్స్ ఫర్వాలేదనిపించాడు.

కాగా, రెండో టెస్టు అనంతరం అత్యవసరంగా వ్యక్తిగత పనుల నిమిత్తం అతడు సిడ్నీ వెళ్లాడు. తల్లి అనారోగ్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో మూడో టెస్టు నాటికి భారత్‌కు తిరిగి రాలేనని కమిన్స్‌ యాజమాన్యానికి తెలిపాడు. 'ఈ సమయంలో నేను భారత్‌కు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఇక్కడ నా కుటుంబంతో ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. క్రికెట్‌ ఆస్ట్రేలియా, సహచరుల నుంచి నాకు లభించిన సహకారానికి కృతజ్ఞతలు' అంటూ కమిన్స్‌ స్థానిక మీడియాతో పేర్కొన్నాడు. మరోవైపు యువ ఆల్ రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ మూడో టెస్టుకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

వేదిక నుంచి ఎన్నో మార్పులు

వాస్తవానికి భారత్ - ఆస్ట్రేలియా మూడో టెస్టును హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో నిర్వహించాలి. అయితే, మైదానంపై బీసీసీఐ పరిశీలకులు వ్యతిరేక నివేదిక ఇవ్వడంతో మ్యాచ్ ను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు మార్చారు. మార్చి 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

మరోవైపు మూడో టెస్టుకు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను తప్పించారు. అతడికి తుది జట్టులో స్థానమూ ఖాయమని చెప్పలేని పరిస్థితి. అదే జరిగితే శుభ్ మన్ గిల్ ఆడతాడు. ఇక ఆసీస్ కు కమ్మిన్స్ అందుబాటులో లేనందున స్మిత్ సారథ్యం వహించనున్నాడు. ఇలా మూడో టెస్టు ముందు వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.