Begin typing your search above and press return to search.

సామాన్యులు సచివాలయం రావాలంటే ఇంత కష్టమా కేసీఆర్!

By:  Tupaki Desk   |   19 April 2023 5:00 PM GMT
సామాన్యులు సచివాలయం రావాలంటే ఇంత కష్టమా కేసీఆర్!
X
ప్రజా పాలన ఎలా ఉండాలి? ప్రజలు కోసం ప్రజలు ఎన్నుకునే ప్రజల ప్రభుత్వంలో ప్రజలకు.. ప్రభుత్వానికి మధ్య దూరం అవసరమా? సామాన్యుడు సైతం సీఎంను కలిసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేని పరిస్థితులు గతకాలపు ఘనతలుగా మారిపోతున్నాయా? రాష్ట్ర ప్రభుత్వ కార్యస్థలిగా పేర్కొనే సచివాలయం సామాన్యులు కనీసం అడుగుపెట్టేందుకు కూడా సాధ్యం కాని రీతిలో అమలు చేయనున్ననిబంధనలు బంధనాలుగా మారతాయన్న విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు గుర్తించటం లేదు? భారీ కోటల మాదిరి భవనాల్ని నిర్మించటం బాగానే ఉన్నా.. వాటిల్లోకి తమ ఇంట్లోకి వెళ్లినంత సులువుగా వెళ్లటం ముఖ్యం. అందుకు భిన్నంగా అనుమతుల పేరుతో ఏర్పాటు చేసే నిబంధనలు ప్రజలకు ప్రతిబంధకాలుగా మారతాయన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

వందల కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున నిర్మిస్తున్న సరికొత్త సచివాలయం ఓపెనింగ్ కు సిద్ధమవుతోంది. అయితే.. సచివాలయానికి కల్పించే భద్రత విషయంలో కేసీఆర్ సర్కారు చేపట్టిన చర్యలు మింగుడుపడని రీతిలో ఉంటున్నాయని చెప్పాలి.

గతంలో సచివాలయ భద్రతను రాష్ట్ర పోలీసులు నిర్వహించేవారు. తర్వాతి కాలంలో దీన్ని ప్రత్యేక భద్రతా దళం పర్యవేక్షిస్తోంది. రానున్న రోజుల్లో రాష్ట్ర స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వంద మంది సిబ్బందితో భద్రత నిర్వహిస్తుండగా.. కొత్త సచివాలయం ప్రారంభం నుంచి 650 మందికి పైగా కాపలా కాస్తారని చెబుతున్నారు.

మొత్తం మూడు టీంలతో కలిపి భద్రతను నిర్వహిస్తారు. ఒక్కోటీంలో 300 మంది ఉంటారని.. వారితో పాటు మరో 300 మంది రిజర్వులో ఉంటారని చెబుతున్నారు. వాహనాల రాకపోకల్ని నియంత్రించేందుకు 22 మంది ట్రాఫిక్ పోలీసుల్ని కేటాయిస్తారని చెబుతున్నారు.ఇక.. సచివాలయానికి సామాన్యులు రావాలంటే ముందస్తు అనుమతి ఉంటే తప్పించి లోపలకు వెళ్లలేరు. ఎవరైనా సరే సచివాలయంలో ఏ బ్లాక్ కు వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి మాత్రమే వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సచివాలయంలోని ఏ బ్లాక్ కు అయినా వెళ్లే వీలుంది. రానున్నరోజుల్లో అలాంటి అవకాశమే ఉండదు.

ఎంట్రీ దగ్గర బార్ కోడ్ తో ఇచ్చే పాస్ లు.. ఎవరిని కలవాలని అనుకుంటున్నారో వారిని మాత్రమే కలిసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. వేరే వారిని కలిసేందుకు యాక్సిస్ ఉండదు. దీంతో.. ఇతర బ్లాకులకు వెళ్లే వీలు ఉండదు. సచివాలయంలోని ఆరు అంతస్తుల్లోని మెట్ల మార్గంలోనూ లిఫ్టుల వద్ద పోలీసులు ఉంటారు. 300 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు.

వాటిని పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదాలు ఏర్పడితే నివారించేందుకు వీలుగా రెండు అగ్నిమాపక వాహనాల్ని.. 34 మంది సిబ్బందిని సచివాలయం ఆవరణలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బాడీ.. బ్యాగేజ్.. వెహికిల్ స్కానర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తంగా.. సచివాలయం కాస్తా రాజప్రసాదం మాదిరి మారనుందన్న మాట వినిపిస్తోంది.