Begin typing your search above and press return to search.

భూమా - ఏవీ!... గుంట‌న‌క్క‌లెవ‌రో?

By:  Tupaki Desk   |   24 March 2018 10:06 AM GMT
భూమా - ఏవీ!... గుంట‌న‌క్క‌లెవ‌రో?
X

దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా వ్య‌వ‌హ‌రించిన ఏపీఆర్ ఐసీ చైర్మ‌న్ ఏవీ సుబ్బారెడ్డికి - భూమా త‌న‌య‌ - మంత్రి భూమా అఖిల‌ప్రియ‌కు మ‌ధ్య విభేదాలున్న మాట వాస్త‌వ‌మేన‌ట‌. ఈ విష‌యాన్ని అటు భూమా - ఇటు ఏవీకి వ్య‌తిరేక వ‌ర్గాలు చెప్ప‌లేదు... సాక్షాత్తు ఏవీ సుబ్బారెడ్డినే ఈ విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అఖిల‌ప్రియ‌తో త‌న‌కు విభేదాలున్న మాట వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇటీవ‌ల ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రిగిన భూమా వ‌ర్ధంతి సంద‌ర్భంగా అఖిల‌ప్రియ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని గుంటనక్కలు తనను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని అఖిల ప్రియ నాడు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్యలపై నేటి ఉద‌యం మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ ఏవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే ప్రసక్తి లేదని ఆయ‌న కాస్తంత ఘాటుగానే స్పందించారు.

ఆళ్లగడ్డ - నంద్యాల నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు... చంద్రబాబు - నారా లోకేష్ నాయకత్వాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని ఆయ‌న‌ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆళ్లగడ్డలో ఈ నెల 29వ తేదీన ఎవీ హెల్ప్ లైన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. అదే రోజు అన్ని విషయాలపై స్పష్టత ఇస్తానని చెప్పిన సుబ్బారెడ్డి... అస‌లు గుంటనక్కల గుట్టు విప్పుతానని పేర్కొన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే సమస్య లేదని అన్నారు. భూమా వర్ధంతి సభకు తనకు పిలుపు రాలేదని ఆయన అఖిలప్రియపై మండిపడ్డారు. ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని చెప్పారు. తనకు ఏ పదవి ఇవ్వాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకు - ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు పెరిగిన విష‌యం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకుని పనిచేయాలని అఖిలప్రియను చంద్రబాబు ఆదేశించారు.

కొద్ది రోజుల క్రితం నంద్యాలలో పార్టీ కార్యకర్తలు - నేతలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి - మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ హాజరయ్యారు. కానీ ఈ స‌మావేశానికి అఖిలప్రియ డుమ్మా కొట్టారు. ఈ క్ర‌మంలోనే ఏవీ సుబ్బారెడ్డి నంద్యాల‌లో త‌న ప‌ట్టు పెంచుకున్నార‌ని, భూమా వ‌ర్గాన్ని త‌న వైపున‌కు తిప్పేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా అఖిల‌, ఏవీల మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు వాస్త‌వ‌మేన‌ని తేలిపోగా... ఇప్పుడు అటు టీడీపీని, ఇటు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ తీసేందుకు వ్య‌వ‌హ‌రిస్తున్న గుంట న‌క్క‌లు ఎవ‌రోన‌న్న చ‌ర్చ మొద‌లైంద‌నే చెప్పాలి. తొలుత ఏవీ ల‌క్ష్యంగానే గుంట న‌క్క అంటూ అఖిల వ్యాఖ్య‌లు చేయ‌గా, ఇప్పుడు ఏవీ కూడా అఖిల‌నే టార్గెట్ చేసుకుంటూ గుంట న‌క్క ప‌దాన్ని వినియోగించార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి గుంట న‌క్క ఎవ‌ర‌న్న విష‌యం ఎప్పుడు తేలుతుందో చూడాలి.