Begin typing your search above and press return to search.

రేవంత్ కి వైఎస్సార్ కి తేడా ...?

By:  Tupaki Desk   |   8 May 2022 7:55 AM GMT
రేవంత్ కి  వైఎస్సార్ కి తేడా ...?
X
వైఎస్సార్ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నా ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయనను మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాతనే దక్కింది. ఆయన రాజకీయ ఎంట్రీ బాగా జరిగింది. తొలిసారి ఎమ్మెల్యే కాగానే మంత్రి కూడా అయిపోయారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వస్తే కేవలం మూడున్నర పదుల వయసులో రాజీవ్ చలవతో ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ కూడా అయిపోయారు.

అక్కడ నుంచే వైఎస్సార్ కి కష్టాలు మొదలయ్యాయి. ఆయనని అణగదొక్కే శక్తులు సొంత పార్టీలోనే ఉన్నాయి. అవి గట్టిగా పనిచేయడంతోనే 1989 నుంచి 1994 మధ్య ముగ్గురు కాంగ్రెస్ సీఎంలు రాజ్యం చేసినా వైఎస్సార్ కి మాత్రం చాన్స్ దక్కలేదు. దాంతో ఆయన విసిగిపోయారు. ఒక దశలో పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. సరే ఆ మీదట ఆయనకు కాంగ్రెస్ హై కమాండ్ వద్ద సాన్నిహిత్యం పెరగడంతో తన కలను 2004లో నెరవేర్చుకున్నారు, రెండవసారి 2009లో కూడా ఆయనే మళ్ళీ సీఎం అయ్యారు.

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు కాంగ్రెస్ లో ఎవరు పీసీసీ చీఫ్ గా ఉన్నా లాగేసే శక్తులు సొంత పార్టీలోనే ఉంటాయి. వైఎస్సార్ త్రికరణశుద్ధిగా కాంగ్రెస్ నాయకుడు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కాదు, పైగా రాయల‌సీమ జిల్లాల్లో మంచి బలం ఉన్న నేత, ఉమ్మడి ఏపీ అంతటా క్రేజ్ ఉన్న నాయకుడు. అలాంటి వైఎస్సార్ నే తొక్కిపెట్టిన కాంగ్రెస్ అంతర్గత రాజకీయం
టీపీసీసీ చీఫ్ రేవంత్ కి రాచబాట వేస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న.

రేవంత్ విషయానికి వస్తే ఆయనకు యూత్ తో పాటు, కొన్ని సెక్షన్లలో క్రేజ్ ఉండవచ్చు. అంత మాత్రం చేత ఆయన వైఎస్సార్ మాదిరిగా కాంగ్రెస్ మొత్తాన్ని తన వెంట నడిపించే నాయకుడు కారు అన్నది ఒక మాట. ఇక రేవంత్ నేపధ్యం కూడా ఆయన ముందుకు అడుగులు వేసేందుకు ఇబ్బంది పెడుతొంది. ఆయన ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసారు.

అలాగే 2015లో ఓటుకు నోటు కేసులో ఆయన డబ్బు సంచులతో ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి దొరికిపోయారు అని టీయారెస్ ఈ రోజుకీ ఆరోపిస్తుంది. ఇది ఆయన మీద తేలిక అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతల్లో కలుగచేసేలాగానే ఎపుడూ ఉంటుంది. ఇక కాంగ్రెస్ లో రేవంత్ ప్రస్థానం బొత్తిగా నాలుగైదేళ్ళే. కానీ అదే కాంగ్రెస్ లో మూడు దశాబ్దాలకు పైగా పాతుకుపోయిన నాయకులు ఉన్నారు.

వారికి పార్టీ కంటే కూడా తమ వ్యకిగత ఇమేజ్ ముఖ్యం. తమ కంటే ఎవరూ గొప్ప కాదనుకునే వైఖరి చాలా మంది నేతలలో ఉంది. కాంగ్రెస్ కి ఇపుడు తెలంగాణాలో మంచి వాతావరణం కనిపిస్తోంది. ఆ లెక్కన రేపటి రోజున పార్టీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. మరి ఆ అధికార ఫలాన్ని పూర్తిగా రేవంత్ చేతిలో పెట్టి చూస్తూ ఉండిపోయే ఉదారత అయితే తెలంగాణా కాంగ్రెస్ లోని సీనియర్లకు లేదు.

ఇక రేవంత్ ది దూకుడు రాజకీయం. ఆయనకు రాజకీయ వ్యూహాలు తెలుసు కానీ మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలే ఆయనకు ఒక పట్టాన అర్ధం కావు. ఇక కాంగ్రెస్ లో సీనియర్లు ఓట్లు తేలేరు, చరిష్మా లేదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. వారు ఓట్లు తేలేకపోవచ్చు, తూట్లు మాత్రం పొడవగలరు, ఆ మాటకు వస్తే వైఎస్సార్ అపరిమితమైన పొలిటికల్ ఇమేజ్ తో కాంగ్రెస్ ని శాసిస్తున్న రోజుల్లోనే సీనియర్లు ఆయన కాళ్ళకు ముల్లు పెట్టగలిగారు.

అందువల్ల రేవంత్ విషయం అందుకు భిన్నం కాదు, ఇక రేవంత్ కి టీడీపీ అనుకూల మీడియాతో ఈ రోజుకీ సంబంధాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉందని కాంగ్రెస్ సీనియర్లు అనుమానిస్తున్నారు. దాంతో ఆయన దూకుడుకు బ్రేకులు వేయడానికే వారు చూస్తారు. రేవంత్ సైతం అందరినీ కలుపుకుని పోకుండా తాను ఒక్కడే తెలంగాణా మొత్తం కాంగ్రెస్ ని గెలిపించే పరిస్థితి అయితే లేదు.

ఇక ఇది 2004 కాలం కాదు, రేవంత్ కూడా నాటి వైఎస్సార్ కానే కాదు, ఆయన పరిధిలు పరిమితులు ఆయనకు చాలా ఉన్నాయి. అయితే ఇపుడున్న చాలా మంది కాంగ్రెస్ నేతల కంటే ఎంతో కొంత చరిష్మా ఉన్న నాయకుడు. తెలంగాణాలో ఒక బలమైన సామాజికవర్గానికి ప్రతినిధి. ఇక రాహుల్ ఆశీస్సులు ఈ రోజు వరకు అయితే ఉన్నాయి. కానీ సీనియర్లను మచ్చిక చేసుకోవడానికి ఇవేమీ అసలు సరిపోవు.

ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణా కాంగ్రెస్ వాదుల మధ్య రేవంత్ అంగుష్టమాత్రుడుగా ఈ రోజుకూ కనిపిస్తున్నారు. అసలు ఈ కాంబోనే వారు తట్టుకోలేకపోతున్నారు. మరి రేవంత్ మీద పూర్తి నమ్మకం పెట్టి రాహుల్ తెలంగాణా కాంగ్రెస్ కి ఆయనే అంతా అని వదిలేయవచ్చా. రేవంత్ వైఎస్సార్ లా ఒంటి చేత్తే కాంగ్రెస్ బండి లాక్కురాగలరా. ఇది మాత్రం టఫ్ టాస్క్. అందుకే కాంగ్రెస్ లో ఈ రకమైన వాతావరణాన్ని చూస్తూ టీయారెస్ ఈ రోజుకి కూడా చాలా కూల్ గా ఉంది.