Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌: ప‌ట్ట‌ణాల్లో నిర్ల‌క్ష్యం.. ప‌ల్లెల్లో ప‌కడ్బందీగా

By:  Tupaki Desk   |   3 April 2020 6:30 PM GMT
లాక్‌ డౌన్‌: ప‌ట్ట‌ణాల్లో నిర్ల‌క్ష్యం.. ప‌ల్లెల్లో ప‌కడ్బందీగా
X
ప్ర‌స్తుతం భార‌త‌దేశం మొత్తం బోసిపోయింది. ప్ర‌జ‌ల సాధార‌ణ జీవితానికి విఘాతం ఏర్ప‌డింది. వారి కార్య‌క‌లాపాల‌న్నీ లాక్‌ డౌన్ పుణ్యాన ప‌క్క‌కు పెట్టేశారు. ఇప్పుడు సంతోషంగా కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపే స‌మ‌యం వ‌చ్చింది. క‌రోనా నివార‌ణ కోసం విధించిన లాక్‌ డౌన్ (స్వీయ గృహ నిర్బంధం) స్వ‌చ్ఛందంగా ప‌క‌డ్బందీగా కొన‌సాగుతోంది. అయితే ఈ లాక్‌ డౌన్ అమ‌లు - దేశంలో ఎలా కొన‌సాగుతోంద‌ని భార‌త హోం శాఖ రోజువారీగా స‌మీక్షిస్తోంది. ఈ మేర‌కు రాష్ట్రాల‌కు కొన్ని సూచ‌న‌లు - స‌ల‌హాలు ఇస్తోంది. ఆ మాదిరి తెలంగాణ‌లో కూడా పోలీస్ శాఖ స‌మీక్షిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ స‌ర్వే చేప‌ట్టగా ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు తెలిశాయి. లాక్‌ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతున్న‌ది కేవ‌లం ప‌ల్లెల్లోనే. వంద‌కు వంద శాతం లాక్‌ డౌన్ అమ‌లు కొన్ని గ్రామీణ‌ ప్రాంతాల్లో అమ‌ల‌వుతుండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అయితే ప‌ట్ట‌ణాల్లో మాత్రం ప‌రిస్థితి ఏమీ మార‌లేదు. లాక్‌ డౌన్‌ ను ప‌ట్ట‌ణవాసులు విస్మ‌రిస్తున్నారు. య‌థేచ్ఛ‌గా బ‌య‌ట‌కు తిరుగుతూ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ లాక్‌ డౌన్‌ పై నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆ స‌ర్వే మేర‌కు ప‌రిస్థితి ఇలా ఉంది.

లాక్‌ డౌన్‌ ను ప‌క్కాగా.. విజ‌య‌వంతంగా అమ‌ల‌వుతున్న‌ది గ్రామీణ ప్రాంతాల్లోనే. లాక్‌ డౌన్‌ ను కచ్చితంగా పాటిస్తున్నవారిలో గ్రామస్తులే ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని పోలీసు శాఖ గుర్తించింది. చిన్న పట్టణాలు - టౌన్‌ లలో దాదాపు 50 శాతం ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటిస్తుండ‌గా గ్రామాల్లో మాత్రం అత్యధికంగా 80 శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఇంటికొక‌రు చొప్పున - ముఖానికి మాస్కులతో భౌతిక దూరం పాటిస్తూ బయటకు వ‌స్తూ లాక్‌ డౌన్ నియ‌మ‌నిబంధ‌న‌లు ప‌క్కాగా పాటిస్తున్నారు. గ్రామాల్లో ఉండే రైతులు - నిర‌క్ష‌రాస్యులు - వృద్ధులు లాక్‌ డౌన్‌ పై ఇంత జాగ్ర‌త్త‌గా పాటిస్తున్నారు. అందుకే ప్ర‌తి పల్లెలో స‌రిహ‌ద్దులు మూసేసుకున్నారు. తమ గ్రామాల్లో ఇత‌ర ప్రాంతాల వారు రావ‌డం - గ్రామ‌స్తులు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ల‌డం పూర్తిగా నిషేధం విధించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. గ్రామాన్ని ప‌రిశుభ్రంగా పెట్టుకుంటూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. క‌రోనా వైర‌స్ గ్రామ‌స్తుల్లోనూ అత్య‌ధికంగా చైత‌న్యం ఉంది. వారు బ‌య‌ట‌కు వెళ్లి తిరిగివ‌స్తే శుభ్రంగా కాళ్లు - చేతులు - ముఖం క‌డుక్కుని మ‌రీ ఇంట్లోకి వెళ్తున్న స‌న్నివేశాలు క‌నిపిస్తున్నాయి. కానీ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మాత్రం ప్ర‌జ‌లు లాక్‌ డౌన్‌ ను ప‌ట్టించుకోవ‌డం లేదు. య‌థేచ్ఛ‌గా బ‌య‌ట తిరుగుతున్నారు. నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు. దీంతో వారు లాక్‌డౌన్‌ను కేవ‌లం 50 శాతం కూడా పాటించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌ర్వే ప్ర‌కారం లాక్‌ డౌన్ ప‌ట్టణాల్లో 50 శాతం పాటిస్తుండ‌గా.. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పాటిస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

క‌రోనా క‌ట్ట‌డి కోసం ముందుజాగ్ర‌త్త‌గా భార‌త ప్ర‌భుత్వం విధించిన లాక్‌ డౌన్ స‌జావుగానే కొన‌సాగుతోంది. దీని ఫ‌లితం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. 21 రోజులు స్వీయ గృహ నిర్బంధానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తున్నారు. అయితే ఈ లాక్‌ డౌన్‌ కు ప్ర‌జ‌లంతా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారంట‌. క‌రోనా క‌ట్ట‌డి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌లంతా లాక్‌ డౌన్‌ ను మరింత కఠినంగా - మ‌రిన్ని రోజులు పొడిగించాల‌ని కోరుతున్నారని ఈ స‌ర్వేలో తేలింది. దేశ భ‌విష్య‌త్‌.. ఆరోగ్య‌క‌ర స‌మాజం కోసం తాము ఇంకొన్ని రోజులు ఇంటికి ప‌రిమిత‌మవుతామ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారంట‌. ఈ సంద‌ర్భంగా లాక్‌ డౌన్ ఎన్ని రోజులు ఉండాల‌ని స‌ర్వే చేయ‌గా 15 రోజులు చాలని 62శాతం మంది తెల‌ప‌గా - మూడు నెలలకు పొడిగించాలని 27 శాతం మంది కోర‌గా - ఆరు నెలల పాటు అమలుచేయాలని 5 శాతం మంది - తామేమీ చెప్ప‌లేమ‌ని 6 శాతం మంది తెలిపారంట‌.