Begin typing your search above and press return to search.

వరదల వేళ ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా?

By:  Tupaki Desk   |   18 Aug 2020 5:30 PM GMT
వరదల వేళ ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా?
X
రెండు సోదర రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఒకేలాంటి పరిస్థితి చోటు చేసుకుంటే.. సహజంగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరించారన్న పోలిక ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్ని కొన్ని ప్రాంతాల్ని అతలాకుతలం చేశాయి. పలు ప్రాంతాలు జలమయం కాగా.. ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తింది. ఇది సరిపోదన్నట్లుగా వేలాది ఎకరాలు మునిగిపోయాయి.

గతంలో ఎప్పుడూ లేని రీతిలో.. చరిత్రలో తొలిసారి వరంగల్ మహానగరం వరద నీటిలో మునిగిపోతే.. ఆ స్థాయి ఇబ్బందికర పరిస్థితి ఏపీలోని ఏ ప్రాంతంలోనూ చోటు చేసుకోలేదని చెప్పాలి. మొత్తంగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పక తప్పదు. దీనికి తోడు కరోనా మహమ్మారి తోడైంది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎలా స్పందిస్తారన్న విషయాన్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపించాయి.

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగటం.. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని.. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతేకాదు.. వరద బాధితులకు రూ.2వేల చొప్పున వరద సాయం అందజేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఆదేశాల్ని అధికారులకు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు.. అధికారులు అంతా ప్రజల సమస్యల్ని తీర్చే పనిలో నిమగ్నం కావాలని ఆదేశించారు.

మరి.. తెలంగాణలో ఎలాంటి సీన్ ఉందన్నది చూస్తే.. కొత్త సిత్రం కనిపించక మానదు. ఫామ్ హౌస్ నుంచితిరిగి వచ్చిన కేసీఆర్.. భారీ వర్షాల వేళ.. ప్రగతిభవన్ లో కూర్చొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేయటమే పనిగా కేసీఆర్ వ్యవహరించారన్న మాట వినిపించింది. ఊహించని రీతిలో మునిగిన వరంగల్ మహానగరాన్ని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళతారని.. ఏరియల్ సర్వే చేస్తారని భావించారు. అందుకు భిన్నంగా తాను వెళ్లకుండా.. తన కొడుకు కమ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కు మరో సీనియర్ మంత్రి ఈటెలను తోడు ఇచ్చి పంపిన వైనం ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్ని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి వెళతారు. ఒకవేళ.. తన వారసుడికి పట్టాభిషేకం చేయాలని భావించినా.. ప్రజలు ఏమైనా అనుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అయినా.. తానే స్వయంగా వెళ్లేందుకు వీలుగా నిర్ణయాలుతీసుకుంటారు. అందుకు భిన్నంగా తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రుల్ని పంపిన వైనం చూస్తే.. ప్రజలకు ఏం జరిగితే ముఖ్యమంత్రి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరి.. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ సారు వరకు వెళుతున్నాయా? అన్నది క్వశ్చన్ గా మారింది.