Begin typing your search above and press return to search.

బాబుది వ్య‌క్తి పూజ‌..జ‌గ‌న్‌ ది వ్య‌వ‌స్థ‌ల ఛేంజ్‌!

By:  Tupaki Desk   |   30 July 2019 1:30 AM GMT
బాబుది వ్య‌క్తి పూజ‌..జ‌గ‌న్‌ ది వ్య‌వ‌స్థ‌ల ఛేంజ్‌!
X
న‌మ్మ‌కం-విశ్వాసం అనే రెండు విష‌యాల‌పైనే రాజ‌కీయాలు సాగుతుంటాయి. ముఖ్యంగా నాయ‌కుల‌పై న‌మ్మ‌కంతోనే అధినేత‌లు పార్టీలను న‌డుపుతుంటారు. చాలా విష‌యాల్లో నాయ‌కులు చెప్పిన వాటినే విశ్వ‌సించి ముందుకు వెళ్తారు. ఈ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి ప్ర‌స్తుత ప్ర‌భుత్వాధినేత జ‌గ‌న్ వ‌ర‌కు కూడా ఎవ‌రూ అతీతులు కారు. అయితే, ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. అందుకే ఎక్క‌డైనా ఎదురు దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు నాయ‌కులు చెప్పిన మాట‌లు న‌మ్మి మోస‌పోయిన సంద‌ర్భాలు కూడా పార్టీల‌కు ఉంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం అధినేతల‌ పైనే ఉంటుంది.

ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఎక్క‌డా మారిన‌ట్టు మ‌న‌కు క‌నిపించ‌రు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పుడు కూడా నాయ‌కులు చెప్పిన విష‌యాల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ముందుకు సాగుతున్నారు. గ‌తంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో పేట్రేగిన అప్ప‌టి ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ - గుంటూరు జిల్లా గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు స‌హా అనేక మంది నేత‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యారు. మ‌రికొంద‌రు త‌మ వ్యాఖ్య‌ల‌తో పార్టీని - ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడితే.. ఇంకొంద‌రు త‌మ చేత‌ల ద్వారా ప్ర‌జ‌ల‌నే ఏకంగా ఇక్క‌ట్ల పాలు జేశారు. ఆయా విష‌యాలు తెలిసినా.. వ్య‌క్తుల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉండ‌డంతో చంద్ర‌బాబు వీరికే ప్రాధాన్యం ఇచ్చారు.

వ్య‌వ‌స్థ‌లో మార్పుకోరుతున్న ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌ను బాబు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. దీంతో ఇలాంటి వివాదాస్ప‌ద నేత‌ల‌కే పార్టీలోనూ టికెట్లు ఇచ్చారు. వారినే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టారు. ఫ‌లితం ఎలా వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. అంటే వ్య‌క్తుల‌పై ఆదార‌ప‌డిన రాజకీయ పార్టీ ఎలా దెబ్బ‌తిన్న‌దో టీడీపీని మించిన ఉదాహ‌ర‌ణ లేదు. ఇప్పుడు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా వ్య‌క్తుల‌పైనే చంద్ర‌బాబు ఆధార‌ప‌డుతున్నారు. కానీ, దీనికి భిన్నంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందుకు సాగుతున్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎవ‌రిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. ఆయ‌న వెంట‌నే వారిని ప‌క్క‌న పెట్టారు. ఎంత బ‌ల‌మైన నాయ‌కుడైనా కూడా జ‌గ‌న్ లెక్క‌చేయ‌లేదు. ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకొని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేశారు. ఫ‌లితంగా ఆయ‌న తిరుగులేని విజ‌యం కైవ‌సం చేసుకున్నారు. సో.. మొత్తానికి బాబుకు జ‌గ‌న్‌ కు మ‌ధ్య ఉన్న తేడా ఇద‌న్న‌మాట‌!