Begin typing your search above and press return to search.

జగన్ లో ఉన్నది బాబులో కనిపించట్లేదే..?

By:  Tupaki Desk   |   24 Jan 2017 4:50 AM GMT
జగన్ లో ఉన్నది బాబులో కనిపించట్లేదే..?
X
కష్టం వచ్చినప్పుడు ఓదార్పు మాటలు.. తాను ఉన్నానన్న ధైర్యం ఇస్తే సరిపోతుంది. ఈ విషయాన్నిఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ గుర్తించినంత బాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో పలు వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఈ మధ్య కాలంలో ఏపీ విపక్ష నేత రియాక్ట్ అవుతున్న తీరుకు.. ముఖ్యమంత్రి స్పందిస్తున్న తీరుకు మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది.

ఈ మధ్యన రైతుల కష్టాల మీద జగన్ నిర్వహించిన వరుస సభల్లో విపక్ష నేత ప్రస్తావించిన అంశాల్ని.. సంధించిన ప్రశ్నలకుకానీ ఏపీ సర్కారు ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏదో జరిగిపోతుందన్న హడావుడి తప్పించి.. నిజంగా జరుగుతున్నదేమిటన్న విషయం ప్రజలకే కాదు.. ఏపీ అధికారపక్షానికి కూడా తెలీని దుస్థితి నెలకొని ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక ఘోర రైలుప్రమాదం జరిగినప్పుడు.. బాధితుల్ని పరామర్శించాలన్న నైతికధర్మం పాలకులకు ఉంటుంది.

కానీ.. తాజాగా చోటు చేసుకున్న హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన ఘోర దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఎనిమిది మంది విజయనగరం జిల్లా వాసులు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఘటనాస్థలానికి వచ్చి సమీక్షించి వెళ్లారు.కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం బాధితుల్ని పరామర్శించేందుకు టైం దొరకలేదు.

విపక్షనేతగా ఉన్నప్పుడు..ఎక్కడచిన్న ఘటన జరిగినా వెళ్లిపోయే చంద్రబాబు.. పవర్ లోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణి కనిపిస్తోంది. ప్రజలకు కష్టాలు ఎదురైనప్పుడు.. సమస్యల్లో చిక్కుకున్న వేళ నాయకుడు వారి వద్దకు వెళ్లి వారికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రితో పోలిస్తే.. ఏపీ విపక్ష నేత తీరు మెరుగ్గా ఉందన్న వాదన వినిపిస్తోంది. బాబులో పవర్ తీసుకొచ్చిన మార్పును ఆయన కానీ గుర్తించకపోతే.. పవర్ అట్టే కాలం బాబుతో ఉండదన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/