Begin typing your search above and press return to search.

నాటకాల మాట నమ్మేలనంత తీవ్రంగా దీదీకి గాయాలు?

By:  Tupaki Desk   |   11 March 2021 7:15 AM GMT
నాటకాల మాట నమ్మేలనంత తీవ్రంగా దీదీకి గాయాలు?
X
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు పోటీ చేసే నియోజకవర్గం అంటే.. వార్ వన్ సైడ్ అన్నట్లు ఉంటుంది. సీఎం సొంతంగా దిగే చోట అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితుల్నిఎదుర్కొంటున్నారు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే సువేందుకు కొద్దికాలం క్రితం బీజేపీలోకి చేరటం.. ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్న నందిగ్రామ్ లోనే తాను బరిలోకి దిగాలని దీదీ డిసైడ్ కావటంపై పలువురు విస్మయానికి గురి చేసింది.

ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళలోనే.. సీఎం మమతపై దాడికి పాల్పడిన వైనం పెను సంచలనంగా మారింది. నందిగ్రామ్ లో నామినేషన్ వేసిన రోజే దాడి జరగటం గమనార్హం. నామినేషన్ వేసిన తర్వాత రేయపారా ప్రాంతంలోని ఒక ఆలయాన్ని సందర్శించి తిరిగి కారు ఎక్కుతున్న వేళలో.. ఆమెను బలవంతంగా తోసి.. కారు తలుపు వేసినట్లుగా చెబుతున్నారు. విపరీతమైన నొప్పితో విలవిలలాడుతున్న ముఖ్యమంత్రి మమతను కోల్ కతాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎక్స్ రే తీయగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లుగా గుర్తించారు.

ఇదిలా ఉంటే.. దాడి ఉదంతమంతా నాటకమంటూ బీజేపీ.. కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటికి చెక్ పడేలా తాజాగా మమతా బెనర్జీ గాయాల తీవ్రతను తెలియజేసే ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడవి వైరల్ గా మారాయి. దాడి గాయాల తీవ్రతపై వైద్యులు ఈ రోజు ఉదయం (గురువారం) నివేదిక విడుదల చేశారు. ఆమె ఎడమ కాలు చీలమండ.. పాదంలో తీవ్రమైన ఎముక గాయాల్ని గుర్తించినట్లు వెల్లడించారు. మమత కుడి భుజం.. మెడకు కూడా గాయాలైనట్లుగా పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత ఛాతీనొప్పి.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులకు గురవుతున్నారని.. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు వెల్లడించారు. మరిన్ని వైద్య సేవలు అవసరమని తేల్చారు. చిన్న ప్రమాదంగా కొట్టిపారేస్తున్న బీజేపీ నేతల మాటలపై టీఎంసీ వర్గీయులు సీరియస్ గా ఉన్నారు. ప్రస్తుతం దీదీ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.